10-07-2025 12:34:03 AM
అదిలాబాద్, జూలై 9 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్ జిల్లాలో విజయవంతమైంది. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ సంఘాల కార్మికులు కదం తొక్కారు.
జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట జోరు వర్షంలోనూ గొడుకులను చేతబట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐన్టీయూసీ, ఐఎఫ్టీయూ, సీపీఐ (ఎంఎల్) ప్రజపంథా, టీయూసీఐ, ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, ఎన్పీఆర్డీ తదితర సంఘాలన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. 4
కార్మిక కోడ్ లు రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో కోడ్‌లుగా మార్చి కార్మికులకు తీరని అన్యా యం చేస్తోందని ఆయా కార్మిక సంఘాల నా యకులు ధ్వజమెత్తారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలని ఇందుకు చట్టం చేయాలని స్పష్టం చేశారు.
కార్మికుల 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి శ్రామికుల శ్రమ దోపిడికి పాల్పడు తున్నారని ధ్వజమెత్తారు. లేబర్ కోడ్ లతో సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హ క్కును కార్మికులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా సం ఘాల నాయకులు విలాస్, అన్నమోల్ల కిరణ్, ప్రభాకర్ రెడ్డి, సిర్ర దేవేందర్, జగన్ సింగ్, మునిగెల నర్సింగ్, వెంకట్ నారాయణ, బండి దత్తాత్రి, లంక రాఘవులు, ఆశాలత, అగ్గిమల్ల స్వామి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సమ్మె సైరన్..నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సింగరేణిలో సమ్మె సక్సెస్ అయింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణిలో బుధవారం గనులు డిపార్ట్మెంట్లు బందు చేసి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కేంద్రం తీసుకువస్తున్న నూతన లేబర్ కోడ్, కనీస వేతనాల పెంపు, ప్రైవేటీకరణ నిర్ణయాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు స్పందించి సింగరేణిలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
దీనితో భారీ ఎత్తున బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అత్యవసర సిబ్బంది తప్ప అన్ని విభాగాల కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు సంఘీభావంగా విధులు బహిష్కరించారు. ఒకరోజు సమ్మె ఫలితంగా మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖనిలో 8 వందల టన్నులు, కాసిపేట 6 వందలు, కాసిపేట 2లో 650 టన్నుల బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. అండర్ గ్రౌండ్ గనులతో పాటు కైరగూడ ఓసీలో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
మందమర్రి, గోలేటి ఏరియాలో సమ్మె సైరన్ మోగింది. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ లు, డిపార్ట్మెంటుల్లో పనిచేస్తున్న కార్మికులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఎక్కడికి అక్కడ సింగరేణి కార్యకలాపాలు నిలిచిపోయాయి. సింగరేణిలో సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపించింది. కార్మిక చట్టాల రద్దు పై సింగరేణి కార్మిక లోకం సమ్మె చేసి తమ వ్యతిరేకతను ప్రకటించింది.
సింగరేణిలో జాతీయ సంఘాలు జేఏసీగా ఏర్పడి సార్వత్రిక సమ్మెకు సింగరేణిలో పిలుపునిచ్చారు. జేఏసీలో ఏఐటీయూసీ, ఐఎన్టీ యూ సీ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఐఎఫ్ టీయూ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంతో పాటు అన్ని సంఘాలు ఏకమయ్యాయి. సింగరేణి కార్మిక లోకం సమ్మెకు సానుకూలంగా స్పందించారు. సింగరేణిలో సార్వత్రిక సమ్మెను దిగ్విజయం చేసింది.
సమ్మెకు బీఎంఎస్ దూరం...
సింగరేణిలో సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘం బీఎంఎస్ దూరంగా ఉంది. కార్మిక సంఘం పేరిట సింగరేణి పనిచేస్తున్న ఆ సంఘం సమ్మెకు దూరంగా ఉండడం పట్ల విమర్శలను మూటగట్టుకుంది. కార్మికుల హ క్కులకు విఘాతం కలిగించే కొత్త లేబర్ కోడ్ తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దాని కొనసాగింపులో భాగంగానే సార్వత్రిక సమ్మె.
ఈ సమ్మెను సింగరేణిలో అన్ని ప్రధాన కార్మిక సంఘాలు తమ భుజస్కందాలపై వేసుకున్నాయి. కానీ బిఎంఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక నిర్ణయానికి మద్దతుగా నిలిచిందని జేఏసీ కార్మిక సంఘాలు మొదటి నుంచీ ఎండగడుతూ వచ్చాయి. సింగరేణిలో కార్మికులు, ఔట్సోర్సింగ్ కార్మికులు సైతం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమ్మెతో కదం తొక్కారు.
సార్వత్రిక సమ్మె సింగరేణిలో జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫలప్రదం అయింది. సమ్మె సక్సెస్ తో కార్మిక వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయం పై సింగరేణి సూరీలు తమ తిరుగుబాటు బావుటను మరోసారి ఎగరవేశాయి.