calender_icon.png 5 November, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియన్ సినిమాకు తెలుగు ఇండస్ట్రీ గొప్ప చిత్రాలనిచ్చింది

05-11-2025 01:43:44 AM

సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఉమేశ్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న సినిమా విశేషాలను నిర్మాత ప్రేరణ విలేకరులతో పంచుకున్నారు. 

నాకు తెలుగు సంస్కృతి చాలా ఇష్టం. హిందీలో సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు సినిమాను స్ఫూర్తిగా తీసుకుంటా. తెలుగు సినిమా చేయాలనే నా కల రామ్‌చరణ్ ‘ఆరెంజ్’ చిత్రం చూసినప్పట్నుంచి ఇంకా బలపడింది. తెలుగు సినిమాలు కమర్షియల్, మాస్, హ్యాపీ, ఫ్యామిలీ అన్ని ఎమోషన్స్‌తో వస్తుంటాయి. తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ సినిమాకు చాలా గొప్ప చిత్రాలను అందించింది. 

వెంకట్ అభిషేక్ చెప్పిన ‘జటాధర’ కథ నాకు చాలా నచ్చింది. కుటుంబ భావోద్వేగాలు, పౌరాణికాంశాలు, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ కథలో పద్మనాభ స్వామి టెంపుల్ ఇన్‌స్పిరేషన్ ఉంటుంది. డివైన్ ఎలిమెంట్స్, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఎక్సైటింగ్‌గా ఉంటాయి. సినిమాలో 60 శాతం లైవ్ విజువల్స్ ఉంటాయి. కథకు అవసరమైన మేర 40 శాతం వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేశాం. సీజీ చాలా సహజత్వం అనిపిస్తుంది. 

సుధీర్‌బాబు అంటే నాకు చాలా అభిమానం. తెలుగులో తొలి సినిమా ఆయనతో చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. సవాలుతో కూడుకున్న సన్నివేశాలెన్నో ఆయన పాషన్‌తో చేశారు. ఆయన నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.

ఈ సినిమా కథ విన్నప్పుడే హిందీలోనూ చేయాలని నిర్ణయించుకున్నా. సోనాక్షి సిన్హా నాకు ముందే తెలుసు. ధన పిశాచి క్యారెక్టర్‌కు ఆమె పర్‌ఫెక్ట్. ఈ పాత్ర థియేటర్‌లో ప్రేక్షకులకు తప్పకుండా గొప్ప అనుభూతినిస్తుంది. -సోనాక్షి ఈ సినిమా కోసం చాలా బరువైన ఆభరణాలు వేసుకున్నారు. సుధీర్, సోనాక్షి మధ్య బలమైన యాక్షన్ పోరాట సన్నివేశాలుంటాయి. అవన్నీ ప్రేక్షకులను అలరిస్తాయి.-శిల్పా శిరోద్కర్ పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భావోద్వేగాలతో నిండిన పాత్ర అది. 

సీక్వెల్‌లా.. ఫ్రీక్వెలా చెప్పలేం కానీ, ‘జటాధర’కు కొనసాగింపుగా ఇంకో సినిమా అయితే ఉంటుంది. అంతేకాక మరో తెలుగు సినిమా కూడా చేయబోతున్నాం. అది పెద్ద హీరోతో ఉంటుంది. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తాం. భవిష్యత్తులో తెలుగు నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు చేయాలని భావిస్తున్నాం.