27-01-2026 01:01:45 AM
అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవం
రంగారెడ్డి జిల్లా, జనవరి 26(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం దేశభక్తి భావనతో పులకించింది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించా రు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందడమే ప్రభుత్వ లక్యం అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం కలెక్టర్ జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వ్యవసాయ, విద్యా, వైద్య, అగ్నిమాపక వంటి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు మరియు స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీపీస్ నాదర్గుల్ విద్యార్థుల ’చెక్ దే ఇండియా’ నృత్యం, ఎంజేపీ పాలమాకుల విద్యార్థుల జానపద నృత్యం, భాష్యం మహేశ్వరం విద్యార్థుల ’జై జవాన్ జై కిసాన్’ ప్రదర్శన. కేజీబీవీ ఆమనగల్ వారి బోనాల నృత్యం, తుక్కుగూడ విద్యార్థుల బంజారా నృత్యం ఆహుతులను అలరించాయి.
సంక్షేమంలో భాగంగా కలెక్టర్ పలువురు లబ్ధిదారులకు కీలక చెక్కులను పంపిణీ చేశారు.జ్యోతి జిల్లా మహిళా సమాఖ్యకు, 797,21,00,000 భారీ చెక్కు అందజేత,చేనేత రుణమాఫీ: 82,51,257 చెక్కు పంపిణీ,అనంతరం దివ్యాంగులకు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు మరియు శ్రవణ యంత్రాల పంపిణీ చేశారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్వో సంగీత, శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఐపీఎస్, వివిధ శాఖల అధికారులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మేడ్చల్ జిల్లా ముందంజ: కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి
మేడ్చల్, జనవరి 26 (విజయ క్రాంతి): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ మను చౌదరి అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మల్కాజిగిరి డిసిపి సిహెచ్. శ్రీధర్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గత సంవత్సర కాలంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి కలెక్టర్ తెలియజేసారు.
జిల్లాను అన్నిరంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి లో ముందుంచేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలోని ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన వేడుకలను పురస్కంచుకొని జిల్లాలోని ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.
అనంతరం ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేసారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ హరిప్రియ, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, కలెక్టరేట్ ఎఓ సుజాత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యంగంపై అవగాహన పెంచాలి: అదనపు జిల్లా న్యాయమూర్తి స్వాతిరెడ్డి
షాద్‌నగర్ జనవరి 26 (విజయక్రాంతి):రాజ్యాంగంపై ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగినప్పుడే క్రమశిక్షణమైన జీవితం అలవడుతుందని షాద్ నగర్ అదనపు జిల్లా న్యాయమూర్తి స్వాతి రెడ్డి అన్నారు.
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం షాద్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలైన న్యాయవాదులకు ఆమె చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవలే బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారం బోర్డు, మహిళలకు రింగ్ బాల్ తదితర పోటీలను బార్ అసోసియేషన్ నిర్వహించింది. ఇందులో విజేతలైన వారికి గణతంత్ర వేడుకల సందర్భంగా బహుమతులు అందచేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిరెడ్డి. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగం విలువలు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు కార్యదర్శి గుండుబావి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
ఊరు వాడలో రెపరెపలాడినజెండా..
తాండూరు, జనవరి 26 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్ మండలాలతో పాటు తాండూరు మున్సిపల్ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు పాఠశా లలు, కాంగ్రెస్, బిజెపి, టిఆర్‌ఎస్ తదితర రాజకీయ పార్టీల నాయకులు, మరియు వ్యాపార సంస్థల ప్రతినిధులు మువ్వన్నెల జెండా ఎగురవేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. పెద్దముల్ మండలం రచ్చకట్ట తండాలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సునీల్ రాథోడ్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆట. పాట పోటీల్లో విజయం సాధించిన చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు.