20-11-2025 12:00:00 AM
-జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసన
-త్వరలోనే న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ
ఇబ్రహీంపట్నం, నవంబర్ 19: జర్నలిస్టుల హక్కుల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పాల్గొన్నారు. యూనియన్ నాయకులు, జర్నలిస్టులు తమ ప్రధాన డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
వీటిలో సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలు ఉన్నాయి. నిత్యం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులకు తగిన భద్రత, గుర్తింపు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల వినతిని స్వీకరించిన జిల్లా కలెక్టర్, సమస్యలన్నింటినీ సావధానంగా విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వారి న్యాయమైన డిమాండ్లను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కొద్ది రోజుల్లోనే జర్నలిస్టులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం. ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు అందేలా చూస్తాం అని కలెక్టర్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కలెక్టర్ ఇచ్చిన హామీపై టిడబ్ల్యూజెఎఫ్ నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చాలని వారు కోరారు.