19-11-2025 11:19:17 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): ముషీరాబాద్ కు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్. విశ్వం(69) బుధవారం సాయంత్రం మృతిచెందారు. ఆయన గత కొంతకాలంగా డయాలసిస్ తో బాధపడుతున్నాడు. నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. 2020 సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భోలక్ పూర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేస్తూ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ కు నమ్మిన బంటుగా ఎదిగాడు. పార్టీలో అనేక పదవుల్లో కొనసాగడంతో పాటు తెలంగాణ రాష్ట్ర జంగమ సమాజం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి. జంగమ కులస్తులను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహించిన క్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గంకు చెందిన అనేక పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ఎంతో కృషిచేశాడు. ఆస్పత్రి వైద్యాధికారులతో మాట్లాడి రోగులకు మెరుగైన వైద్యం అందేలా బాధ్యతాయుతంగా పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు నందగిరి నర్సింహా, బిజ్జి కనకేష్ కుమార్, రాజశేఖర్ తదితరులు వారి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. విశ్వం అంత్యక్రియలు ముషీరాబాద్ లోని హిందూ శ్మశానవాటికలో గురువారం మధ్యాహ్నం 3గంటలకు నిర్వహిస్తామని ఆయన కుమారుడు రాజేష్ తెలిపారు.