10-02-2025 10:52:24 PM
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..
మార్చి 15 నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి..
వెలుగుమట్ల అర్బన్ పార్క్ లో సెల్ఫీ పాయింట్ లు ఏర్పాటు చేయాలి..
వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్..
ఖమ్మం (విజయక్రాంతి): ప్రజలకు ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి, వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను సందర్శించారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ దగ్గర మెయిన్ రోడ్ నుంచి పార్క్ వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడు.. మెయిన్ రోడ్డు వద్ద వెలుగు మట్ల అర్బన్ పార్క్ గురించి తెలిసే విధంగా ఆర్చి ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు నిర్మాణ పనులు రెండు వైపుల నుంచి జరగాలని, మార్చి 15 నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వెలుగుమట్ల అర్బన్ పార్క్ గురించి తెలిసేలా సమాచార బోర్డులను సమీకృత కలెక్టరేట్ బస్ స్టాప్ వద్ద ఏర్పాటు చేయాలని, అక్కడి నుంచి వెలుగుమట్ల అర్బన్ పార్కు వచ్చేందుకు వీలుగా వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని అన్నారు. అర్బన్ పార్కుకు ప్రత్యేకంగా బస్సు సర్వీస్ నడిపేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. హైదరాబాదులోని ప్రగతి రీసార్ట్ ను ట్రెడిషనల్ ప్లాంట్స్ తో ఆకర్షణీయంగా తయారు చేశారని, అదే రీతిలో వెలుగుమట్ల అర్బన్ పార్కును ఆకర్షణీయంగా రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని, ఒకసారి ప్రగతి రీసార్ట్ కు వెళ్లి పరిశీలించి రావాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ లో వీలైనంత అధికంగా బెస్ట్ వ్యూస్ కనిపించేలా సెల్ఫీ పాయింట్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. పర్యాటకులు ఇక్కడ ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్ల మన పార్క్ కు మంచి గుర్తింపు రావాలని అన్నారు.
పార్క్ లో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు ప్రణాళిక తయారు చేయాలని, అవసరమైన సైకిల్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. పార్క్ కు ప్రజలు వచ్చి వన భోజనాలు చేసే విధంగా ఏర్పాటు ఉండాలని అన్నారు. పార్క్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వ్యూ పాయింట్ దగ్గర చేపడుతున్న నిర్మాణాలు పరిశీలించి, సూచనలు చేశారు. క్యాంటీన్ పూర్తి ప్లాస్టిక్ రహితంగా వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశల వారిగా అర్బన్ పార్క్ పూర్తి స్థాయిలో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. వెలుగుమట్ల చుట్టూతా ఫెన్సింగ్ ఏర్పాటు పూర్తిచేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, అటవీ బీట్ అధికారులకు యూనిఫామ్, షూస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ అధికారి జి. నాగేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఏఈ అనిత, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.