18-11-2025 12:00:00 AM
మట్టి తీసి, చెట్లు కొట్టి మరమ్మత్తులు చేపట్టిన అధికారులు
మిర్యాలలో శుభ్రమైన నీటి తొట్లు
నూతనకల్, నవంబర్ 17:మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో నిరుపయోగంగా మారిన పశువుల నీటి తొట్లపై ’విజయక్రాంతి’ దినపత్రికలో సోమవారం వచ్చిన నీటి తొట్టి కట్టి వదిలేశారు అనే కథనానికి ఆధికారులు వెంటనే స్పందించారు. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి సునిత సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. వేల రూపాయలు వెచ్చించి నిర్మించినప్పటికీ, పట్టించుకోకపోవడంతో శిథిలమైన నీటితొట్ల మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని ఆమె గ్రామ పంచాయతీ అధికారిని ఆదేశించారు.
ఆమె ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మిర్యాల గ్రామంలో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్లలోని మట్టిని తీసి, చెట్లు కొట్టి శుభ్రపరిచడంతో పాటు మరమ్మత్తులు చేసే పనులను సోమవారం నుంచే ప్రారంభించారు. మొత్తానికి పశువుల దాహార్తిని తీర్చేందుకు వీలుగా నీటిని నింపే పనులను వేగవంతం చేశారు. దీంతో ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విజయక్రాంతి దినపత్రికకు, ,తక్షణమే స్పందించిన అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.