02-07-2025 12:00:00 AM
మహబూబాబాద్, జూలై 1 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కూరగాయలు, పూలు, పండ్లు, చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 4.50 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎట్టకేలకు అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వం హాయంలో సిద్దిపేట తర్వాత మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 4.50 కోట్ల వ్యయంతో, రెండు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు.
అంతకుముందు అక్కడ ఉన్న కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్, ఫిష్ వ్యాపారులను తాత్కాలికంగా గాంధీ పార్క్ లో మార్కెట్ ఏర్పాటు చేసి అక్కడికి పంపించారు. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి 2023 జూన్ 30న అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం కూడా నిర్వహించారు. అయితే కొన్ని పనులు మిగిలిపోవడం, ఇతర కారణాలతో మార్కెట్ వినియోగంలోకి తేకుండా వదిలేశారు.
ఇంతలో ఎన్నికలు జరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మార్కెట్ వినియోగంలోకి తెచ్చే విషయం పెండింగ్ లో పడింది. ఫలితంగా కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది. కొందరు చిరు వ్యాపారులు గాంధీ పార్కులో షాపులు ఏర్పాటు చేసుకోగా, చాలామంది రోడ్డుపైనే అక్కడక్కడ తమ వ్యాపారాలను ఇబ్బందులు పడుతూ కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో పలు వస్తువులు అపహరణకు గురికావడం, కొన్ని ధ్వంసం కావడం జరిగింది. అలాగే పూర్తిస్థాయిలో వ్యాపారులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల వ్యాపారులకు కేటాయించలేకపోయారు. దీనితో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినప్పటికీ నిర్లక్ష్యంగా వదిలేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పునః ప్రారంభం కోసం ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా టి యు ఎఫ్ ఐ డి ద్వారా ఒక కోటి రూపాయలు మంజూరు చేయడంతో మిగిలిపోయిన పనులు, వసతుల కల్పన కోసం చర్యలు చేపట్టారు. షట్టర్ల ఏర్పాటు, మార్కెట్లోకి కోతులు ప్రవేశించకుండా గ్రిల్ ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల పనులు నిర్వహిస్తున్నారు. పనులు పూర్తిచేసిన వెంటనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వినియోగంలోకి తేవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
త్వరలో మార్కెట్ ను వినియోగంలోకి తెస్తాం
మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో మిగిలిపోయిన పనులను పూర్తి చేయించడానికి ప్రభుత్వం ద్వారా కోటి రూపాయలు మంజూరు చేయించాం. అసంపూర్తి పనులు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నాం. వ్యాపారులకు, ప్రజలకు మార్కెట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
మౌలిక వసతుల కల్పనతో పాటు ఇతర ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. పనులు పూర్తికాగానే వారం పది రోజుల్లో మార్కెట్ ను వినియోగంలోకి తెస్తాం. ఒకే చోట ప్రజలకు కూరగాయలు, పండ్లు, పూలు, మటన్, చికెన్, ఫిష్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము.
మహబూబాబాద్ ఎమ్మెల్యే, డాక్టర్ భూక్యా మురళి నాయక్