02-07-2025 05:13:31 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
బాలబాలికలతో ఆత్మీయ సమావేశం..
కరీంనగర్ (విజయక్రాంతి): కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన ఏడుగురు బాలబాలికలకు పిఎం కేర్ ద్వారా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ(Women Development and Child Welfare) ఆర్థిక సాయం అందజేస్తోంది. 18 సంవత్సరాల వయసు నిండేసరికి 10 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమవుతాయి. జిల్లాలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఏడుగురు పిల్లలలో నలుగురికి 18 సంవత్సరాల నిండినందున వీరితో కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అనాధ బాలబాలికతో మాట్లాడి వారి విద్య, జీవన విధానం తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తున్నామని అన్నారు. కష్టపడి చదివి జీవితంలో నిలదొక్కుకోవాలని, పలువురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. చెడు ఆలోచనలు చేయవద్దని, మంచి మార్గాల్లో పయనించాలని సూచించారు. ఈ సందర్భంగా పిల్లల సమస్యలను అడిగి తెలుసుకొని ఏం చదువుకోవాలన్నా ప్రభుత్వ సంస్థల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని సూచించారు.
పిల్లలకు వారసత్వంగా వచ్చే ఆస్తులను వారికి సంక్రమించేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. పీఎం కేర్ ద్వారా జమ చేసిన సొమ్మును విద్యా అవసరాలకు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాంకు పాస్ బుక్, ఆరోగ్య కార్డులు అందజేశారు. ఈ పిల్లల్లో ఒకరు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతుండగా మరో విద్యార్థినికి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అడ్మిషన్ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ డిడబ్ల్యూఓ సబిత, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, డిసిపిఓ పర్వీన్, పిఓలు తిరుపతి, శాంత, ఎల్సిపిఓ రాజు పాల్గొన్నారు.