15-12-2025 01:15:11 AM
కొమురవెల్లి, డిసెంబర్ 14: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తోట బావి ప్రాంతం వేదికయింది. స్వామి వారి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మంగళవాద్యాలతో పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చి పీటలపై ఉంచారు. మల్లికార్జున స్వామి తరఫున పడగన్న గారి వంశస్థులు, మేడలమ్మ, కేతమ్మల తరఫున మహాదేవుని వంశస్థులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
సంగారెడ్డి జిల్లా బర్దీపూర్ వీరశైవ ఆగమ సంప్రదాయ పీఠాధిపతులు మహంతి సిద్దేశ్వరానందగిరి మహాస్వామి పర్యవేక్షణలో ఈ వేడుక జరిగింది. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం కళ్యాణ కత్రువు నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ మల్లికార్జున స్వామి మేడలాంబ, కేతలాంబను మనువాడారు.
కళ్యాణ ఘట్టాన్ని తిలికించేందుకు పరిసర గ్రామాలే కాకుండా రాష్ర్ట నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకలలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నాగపురి రాజలింగం, దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు,ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి పెద్దపీట: కొండా సురేఖ
ఆలయాల అభివృద్ధికి ప్రభు త్వం పెద్దపీట వేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వచ్చే సంవత్సరం మల్లన్న కల్యాణంలోగా అ మ్మవార్లకు స్వర్ణ కిరిటాలను తయా రు చేస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పలు దేవాలయాలకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఆమెవెంట మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, మహాదేవుని శ్రీనివాస్ ఉన్నారు.