19-12-2025 12:52:15 AM
హైకోర్టు న్యాయవాది జగదీశ్వర్ రావు
ధర్పల్లి, డిసెంబర్ 18 (విజయ క్రాంతి): న్యాయవాదుల సంక్షేమమే ద్యేయంగా కార్యాచరణతో ముందుకు వెళతానని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది డి. జగదీశ్వర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు జనవరి నెలలో నిర్వాహంచబోయే ఎన్నికలలో తనను సభ్యునిగా ఎన్నుకోవాలని ఆయన న్యాయవాదులను కోరారు. గురువారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు.
ముప్పు రెండేళ్ల న్యాయవాద వృత్తిలో ప్రభుత్వ న్యాయవాదిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అధ్యక్షుడుగా విధులు నిర్వహించానని న్యాయవాదుల సాదాకబాధకాలు తెలుసని అన్నారు. బార్ కౌన్సిల్ అనేది న్యాయవాదులందరికి ప్రాతినిద్యం వహించే అధికారిక వ్యవస్థనని ఆయన తెలిపారు.కౌన్సిల్ కు చాలా ప్రాధాన్యత ఉన్నదని సభ్యునిగా విజయశిఖరాలకు చేరిస్తే, ప్రతి న్యాయవాది పనులలో తోడుగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.
న్యాయవాదుల రక్షణ చట్టం ఆవశ్యకత ఉన్నదని, చట్టం రక్షణ గొడుగు కావాలని ఆయన అన్నారు. న్యాయవాదుల హెల్త్ కార్డుల జారీలో ఉన్న కొన్ని నిబంధనలు సడలిపింపులు కావాలని, న్యాయవాదుల తల్లితండ్రులను కూడా హెల్త్ కార్డుల పరిధిలోకి తీసుకు రావలసిన అవసరం ఉన్నదని జగదీశ్వర్ రావు తెలిపారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంతెన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరిని కలుపుకుని పోయే వ్యక్తి, సీనియర్ హైకోర్టు న్యాయవాది జగదీశ్వర్ రావు రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికలలో సభ్యునిగా గెలిపించడానికి కృషి చేద్దామని అన్నారు.
నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదిగా సుధీర్ఘ అనుభవం, న్యాయవాదుల సమస్యల పట్ల అవగాహన ఉన్న జగదీశ్వర్ రావు లాంటి వారు రాష్ట్ర బార్ కౌన్సిల్ లో ఉండాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, సీనియర్ న్యాయవాదులు కుమార్ దాసు, ముసుగు రాజేశ్వర్ రెడ్డి, రాజలింగం, జక్కుల వెంకటేశ్వర్, మహ్మద్ ఖాసీమ్ తదితరులు పాల్గొన్నారు.