17-05-2025 12:15:21 AM
6 హుండీలలో నగదు అపహరణ
మేడ్చల్, మే 16 (విజయ క్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలోని గట్టుమైసమ్మ దేవాలయంలో దొంగలు చొరబడి 6 హుండీలను ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. ఆలయం ఈవో భాగ్యలక్ష్మి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గట్టు మైసమ్మ తల్లి దేవాలయంలో గురువారం రాత్రి పూజలు ముగిసిన అనంతరం తాళాలు వేసి వెళ్లిపోయారు.
శుక్రవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన వ్యక్తి ఆలయం, స్టోర్ రూం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. గమనించిన వ్యక్తి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి భాగ్యలక్ష్మికి సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించి ఆలయానికి చేరుకుని పరిశీలించారు. తాళాలు పగలగొట్టి అందులోని 6 హుండీలను ధ్వంసం చేశారు.
రెండు నెలలుగా లెక్కించని హుండీలలో 40 వేలకు పైగా నగదు ఉంటుందని ఆమె తెలిపారు. గురువారం రాత్రి వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు. గట్టుమైసమ్మ అమ్మవారి ఆలయంతో పాటు గ్రామ దేవత ఆలయంలోని 2 హుండీలను ధ్వంసం చేసి అందులోని నగదు తీసుకొని ముళ్ల పొదలలో పడేశారు.
స్టోర్ రూమ్ లో భద్రపరిచిన మరో 4 హుండీలను అక్కడే ధ్వంసం చేసి నగదు కాజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయటం లేదని పోలీసులు తెలిపారు. ఈఓ భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆడీషనల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.