calender_icon.png 30 August, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లు 5,001

30-08-2025 12:54:38 AM

  1.   3.72 లక్షల మంది పిల్లలకు నో ఆధార్
  2. జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలు 2,245
  3.   2024-25 యూడైస్ నివేదికలో కేంద్రం వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఒకే టీచర్ ఉన్న స్కూళ్లు 5,001 ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఒక్కరే టీచర్ ఉన్న స్కూళ్ల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూడైస్ 2024-25 నివేదికలో వెల్లడించింది. 2022-23లో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లు 6,054 ఉండగా, 2023-24లో ఇది 5,835కి తగ్గింది. 2024-25 విద్యాసంవత్సరానికి అదికాస్త తగ్గి 5,001కి తగ్గింది.

సింగిల్ టీచర్ ఉన్న ఈ పాఠశాలల్లో 62,288 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ స్థానం కాస్త మెరుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు 12,912 ఉండగా, జార్ఖండ్‌లో 9,172, మహారాష్ట్రలో 8,152, కర్ణాటకలో 7,349, మధ్యప్రదేశ్‌లో 7,217, వెస్ట్‌బెంగాల్‌లో 6,482, రాజస్థాన్‌లో 6,117, ఛత్తీస్‌గడ్‌లో 5,973 పాఠశాలలున్నాయి. మనకంటే ఈ రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. 

జీరో ఎన్‌రోల్‌మెంట్  పాఠశాలలు 2,245

 జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలలు 2,245 ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లలో 1,016 మంది ఉపాధ్యాయులున్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో జనరల్ కేటగిరీకు చెందిన వారు 25.5 శాతం ఉండగా, ఎస్సీలు 15.4 శాతం, ఎస్టీలు 9.7 శాతం, ఓబీసీలు 49.4 శాతం, ముస్లింలు 16.2 శాతంగా ఉన్నారు.

అదేవిధంగా మొత్తం రాష్ట్రంలోని 74,57,851 మంది విద్యార్థుల్లో 70,85,297 మంది మాత్రమే ఆధార్ నెంబర్‌ను కలిగి ఉన్నారు. మిగిలిన 3,72,554 మంది ఆధార్ నెంబర్ కలిగిలేరని నివేదికలో తెలిపింది. దీంతోపాటు పాఠశాలల్లోని మౌలిక వసతులు, గ్రంథాలయాలు, మరుగుదొడ్లు, ఆటస్థలాలకు సంబంధించిన గణాంకాలను సైతం కేంద్రం వెల్లడించింది.

74,57,851 మంది విద్యార్థులు

 రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మొత్తం కలిపి 43,154 పాఠశాలల్లో 74,57,851 మంది విద్యార్థులుండగా, 3,57,911 మంది టీచర్లు ఉన్నారు. విద్యార్థుల రేషియో 21 ఉండగా, దేశ సగటు ఒక పాఠశాలలో ఏడు మంది టీచర్లు ఉండగా, తెలంగాణలో ఎనిమిది మంది టీచర్లు పనిచేస్తున్నారు. సగటున ఒక్కో స్కూల్‌లో 173 మంది విద్యార్థులున్నారు.