కేసులు, అరెస్టులకు భయపడేది లేదు
- ఉద్యమకారుల ఆశయాల సాధనకు పోరాటం చేస్తాం
- ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుంది
- తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ కాచం సత్యనారాయణ
ఎల్బీనగర్, జులై 2 : డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు కేసులు, అరెస్టులకు భయపడేది లేదని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు చైర్మన్ కాచం సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపు విషయంలో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఇచ్చిన భూపోరాటం పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
ఇందులో భాగంగా కాచం సత్యనారాయణతోపాటు పలువురు ఉద్యమకారులను గురువారం చైతన్యపురి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఏ పార్టీకి కొమ్ముకాయదని, ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేసే సంఘాల తోటి కలిసి ప్రయాణం చేస్తూ, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో ఉద్యమకారుల సంఘాలకు పార్టీలతోని పని లేకుండా మద్దతు తెలుపు తామన్నారు.
అక్రమ , ముందస్తు అరెస్టులకు పోలీస్ నిర్బంధాలకు భయపడేది లేదని హెచ్చరింన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం గతంలో 2001 నుంచి 2014 వరకు రాష్ట్ర సాధనలో కీలక భూమిక వహించిన శ్రీకాంత్ చారి త్యాగం వృథా కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం మరో ఉద్యమాన్ని కూడా ఎల్బీనగర్ నే అడ్డాగా చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డు, రూ, 25000 పెన్షన్ తదితర హామీలు ఇచ్చిందని ఆ వాగ్దానాల అమలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గుర్తింపు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల నుంచి ఉద్యమకారులకు కనీసం 1000 ఎకరాల భూమిని కేటాయించాలని అన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు తగిన గౌరవం కల్పిస్తూ, ఆగస్టు 1లోపు ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయని క్రమంలో ఆగస్టు 6న ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుంచి తామే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ గుప్తా, ఇరుగు శ్రీధర్, కొత్త రవి, కూర రమేష్, , శ్యామ్ సుందర్ నేత, కృష్ణ, శ్రీనివాస్, తేలుకుంట్ల కృష్ణ, శివ, సురేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






