calender_icon.png 2 August, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో తాత్సారం తగదు

02-08-2025 02:03:07 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, ఆగస్టు 1 :(విజయ క్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన నవీపేట్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు,  వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను, వెటర్నరీ సెంటర్, తహసిల్ ఆఫీసు తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా తహసిల్దార్, ఇతర సిబ్బందితో సమీక్ష జరిపారు.  ఆశించిన రీతిలో దరఖాస్తుల పరిష్కారం జరగడం లేదని ఈ సందర్భంగా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  అనంతరం కలెక్టర్ అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.   అక్కడినుండి కలెక్టర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను, ఇతర ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను సందర్శించి, ఎరువుల నిల్వలను పరిశీలించారు.

ఎరువుల కోసం వచ్చిన రైతులను పలుకరించి, అవసరాలకు సరిపడా ఎరువులు అందిస్తున్నారా అని ఆరా తీశారు.  అనంతరం పశు వైద్యశాలను సందర్శించిన కలెక్టర్, పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలు అందిస్తున్నారా, సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాల పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ వెంకట రమణ, ఏ.ఓ నవీన్, వెటర్నరీ డాక్టర్ బి.నరేందర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హన్మంత్ రావు, ఫర్హతున్నీసా తదితరులు ఉన్నారు.