calender_icon.png 3 July, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపికలో అవినీతి ఉండకూడదు

02-07-2025 06:36:05 PM

అనర్హులను ఎంపిక చేస్తే పథకాలకు విలువ ఉండదు..

అధికారుల పనితీరుతోనే ప్రతిబింబం..

ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా లబ్ధిదారుల ఎంపికలో అవినీతి ఉండకూడదని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్(District Incharge Adluri Laxman Kumar) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆదిత్య భవనములో నల్లగొండ సూర్యపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలవుతున్న పథకాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో అనర్హులని ఎంపిక చేస్తే ఆ పథకాలకు  విలువ ఉండదన్నారు. అధికారుల పనితీరుతోనే ప్రతిబింబం ఏర్పడుతుందని పనితీరులో నిజాయితీ పాదరక్షత ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది అధికారుల చేతుల్లోనే  ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులు పడ్డారని ఈ ప్రభుత్వం రైతుల పట్ల పోరాడుతుందని అన్నారు.

నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుందని నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లు పరిశీలించి ఈనెల 13న ఎంపిక చేస్తే 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం బహిరంగ సభ  ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని  తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ఎస్ఎల్బీసీ పనుల పునః ప్రారంభానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని, భారత సైన్యంలో పనిచేసిన అధికారులను డిప్యూటేషన్ పై తీసుకొని ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

డిండి, హెచ్ ఎల్ సి  లైనింగ్, నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ బునియాధిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలను పూర్తి చేస్తామని అయితే వీటి భూసేకరణను పూర్తి చేసే విషయంపై శాసనసభ్యులు దృష్టి నిలపాలని కోరారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) మాట్లాడుతూ... ఆర్ అండ్ బి ద్వారా నల్గొండ జిల్లాకు ఎక్కువ నిధులు తేవడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తానని 45 కోట్లతో సంగెం బ్రిడ్జికి మంజూరు ఇవ్వడం జరిగిందని, నల్గొండ -మల్లేపల్లి -దేవరకొండ రహదారులను హామ్ రోడ్ కింద మంజూరు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలతో అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు హాం పథకం కింద డబుల్ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని, పంచాయతీరాజ్ రోడ్లను సైతం హామ్ కింద కు తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఎస్ ఎల్ బి సి, టన్నెల్ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేకంగా రివ్యూ చేస్తామని, ఇన్చార్జి మినిస్టర్ జిల్లాకు ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రాథమిక వైద్యం, విద్య ప్రభుత్వానికి అతి ముఖ్యమైనవని, వీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, విద్యలో  భాగంగా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పనులను త్వరలోనే ప్రారంభం చేయనున్నామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేయాలని, ఎస్డిఎఫ్ కింద ప్రతి ఎమ్మెల్యేలకు తక్షణమే ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించి టోకెన్లు రైజ్ చేయాలని ఎమ్మెల్యేలతో కోరారు. ఎనిమిది నెలల్లో నల్గొండ కలెక్టరేట్లో చేపట్టిన అదనపు బ్లాకు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

సమావేశం ప్రారంభమైన వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi), సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, నీటిపారుదల, విద్య, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, భూభారతి, మహిళా శక్తి, సంక్షేమం తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య, నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కుందూర్ రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, దేవరకొండ, తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, శాసనసభ్యులు, బాలు నాయక్, మందుల సామెల్, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఉమ్మడి జిల్లాల అదనపు కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.