06-05-2025 12:04:59 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరికీ స్వచ్ఛమైన, శుద్ధిచేసిన తాగునీటిని అందించాలని, రోజువారీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలు అధికంగా ఉండే ఆదిలాబాద్, ఖమ్మం, కొమ్రుంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి తదితర జిల్లాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జలాశయాల్లో నీటి మట్టాలను ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాల ని సూచించారు. ప్రతిరోజూ జరుగుతున్న టెలీ కాన్ఫరెన్స్‌ను కొనసాగించాలని తెలిపారు. మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ల సమన్వయంతో పనిచేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆదేశించారు. వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో తాగునీటి సరఫరాకు సంబంధించిన వచ్చిన వార్తలపై, ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో తాగునీటి సరఫరాని నిరంతరం పర్యవేక్షించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ భాస్కర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.