03-02-2025 12:59:17 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అధికారంలోకి వస్తే న్యూఢిల్లీలో ఎటువంటి కూల్చివేతలు చేపట్టబోమని ప్రధాని మోదీ ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వస్తే న్యూఢిల్లీలో ఒక్క మురికివాడను కూడా ముట్టుకోం. ప్రచార ఆర్భాటాల కొరకు మేము ఏదీ చేయం. మేమిచ్చిన హామీల మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశాం.
అధికారంలో ఉన్న ఆప్ అబద్దాలు చెబుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. వారు చెప్పినట్లు అస్సలుకే చేయం. మేము ప్రజల ఆశయాల మేరకే పని చేస్తాం. అధికారంలోకి వస్తే ఏ ఒక్క పథకాన్ని కూడా నిలిపేయం. కరోనా సమయంలో కొన్ని పార్టీలు పూర్వాంచల్ వాసులు, బీహార్ వాసులను అన్యాయంగా ఢిల్లీ నుంచి బయటకు పంపారు.
కానీ బీజేపీ ప్రభుత్వం ఎల్లవేళలా పూర్వాంచల్ వాసులకు మద్దతునిస్తుంది. మహమ్మారి సమయంలో ఆప్ ప్రభుత్వం వలసకూలీలకు సరైన వసతులు కల్పించలేదు. బీహార్ కోసం ఎన్డీయే కూటమి ఎంతో చేస్తోంది. అక్కడి రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటుకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. దళితుల సంక్షేమం కోసం మేము అనేక కార్యక్రమాలు చేస్తుంటే.. వీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు’ అని మోదీ అన్నారు.
కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ..
కాంగ్రెస్ పార్టీపై కూడా ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ‘ఢిల్లీ యువతను మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు జరిగిన కామన్‌వెల్త్ కుంభకోణం గురించి అందరికీ తెలుసు. అధికారంలో ఉన్న ఆప్ కూడా ఢిల్లీ యువత భవిష్యత్‌తో ఆటలాడుతోంది. ప్రస్తుతం ఉన్న యువ భారత్ బీజేపీని విశ్వసిస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు.
ఇందిరా ప్రభుత్వంలో ఉండి ఉంటేనా..
కాంగ్రెస్ ప్రభుత్వ పన్ను విధానాలపై కూడా మోదీ విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ, ఇందిరా హయాంలో అధికంగా పన్నులు వేసి మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే సంవత్సరాదాయం రూ. 12 లక్షలు ఉన్నవారు. రూ. 10 లక్షల పన్నులే కట్టాల్సి వచ్చేది. కానీ మేము రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపునిచ్చాం’ అని తెలిపారు.