16-08-2025 12:07:53 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలు చేయలేకనే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన కేసీఆర్ రాజకీయ ప్రస్థానంపై మహేంద్ర తోటకూరి రచించిన ‘ప్రజాయోధుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారంచేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పాలన ముగిసే నాటికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు రూ.2.80 లక్షల కోట్లు మాత్రమేనని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతిని సీఎం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కేంద్రం చెప్పిన ఆ లెక్కలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ వ్యవసాయం రంగం దేశంలో 14వ స్థానంలో ఉండేదని, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ రంగాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. నల్లండ ప్రాంతంలో ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ కేటాయించామని వెల్లడించారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం పెట్టి, పదేళ్లలో రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఎదుర్కొని అత్యద్భుతంగా పనిచేసిన కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూడటం అవివేకమని పేర్కొన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దశాబ్దాలు పాలించిన టీడీపీని కాదని, ప్రత్యేక తెలంగాణ కోసం ఒక పార్టీ పెట్టి, తిరుగులేని రాజకీయ శక్తిగా కేసీఆర్ ఎదిగిన తీరు అద్భుతమన్నారు.
ఎన్టీఆర్, ఎంజీఆర్‌లా కేసీఆర్ సినిమా స్టార్ కాదని, ఆయనకు కుల బలం, ధన బలం, మీడియా పవర్, బలగం అప్పట్లో ఏమీ లేవని గుర్తుచేశారు. పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వయస్సు 47 ఏళ్లని, రాజకీయ నాయకులకు అది టేకాఫ్ టైమని అభిప్రాయపడ్డారు. 2001 నుంచి 2014 వరకు ఆయన పడ్డ కష్టం ముందు, ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎదుర్కొంటున్న కష్టం.. ఏమాత్రం కష్టం కాదని అభివర్ణించారు.
తెలంగాణ రాకముందు ఇక్కడ భాష, యాసను సినిమా వాళ్లు జోకర్లు, విలన్లకు మాత్రమే ఉపయోగించేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత సినిమాలకు ఇప్పుడు మన యాసనే ప్రాణమైందని కొనియాడారు. కేసీఆర్ తలుచుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. పల్లెలో ఏం ఉండాలో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా పట్టణాలను ఎలా విస్తరించాలో తెలిసిన నేత కేసీఆర్ అని శ్లాఘించారు.
కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తుచేశారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇచ్చి, ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని గుర్తుచేసుకున్నారు. కానీ, ఇప్పటి సీఎం రేవంత్ డబ్బులు కూడబెట్టుకొని ఢిల్లీకి మూటలు పంపాలన్న ఆలోచనతోనే ఉన్నారని ఆరోపించారు.
తెలగాణపై ఢిల్లీ పార్టీల పెత్తనం..
బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు ఆత్మగౌరవంతో బతికారని, కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో ఢిల్లీ పార్టీల పెత్తనం నడుస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పరాయి పాలన పోయి, ఇప్పుడు ఢిల్లీ పార్టీల పాలన నడుస్తున్నదని వాపోయారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 51 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ప్రతి చిన్న పనికీ సీఎం ఢిల్లీ వెళ్లడాన్ని చూస్తే అధికార పార్టీ దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
స్వాతంత్య్ర దినోత్సవం వేళ రైతులు యూరియా కోసం చాంతాడంత లైన్లలో చెప్పులు పెడుతున్నారని, ఎండకి ఎండి, వానకు తడుస్తున్నారని వివరించారు. రైతులకు మంచి రోజులు రావాలంటే మళ్లీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్సే అధికారంలోకి రావాలని, ప్రజలు బీఆర్‌ఎస్ పాలననే మళ్లీ కోరుకుంటున్నారని పేర్కొన్నారు.