calender_icon.png 29 September, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గౌరవం’గా మింగుతున్నారు..!

29-09-2025 12:29:30 AM

  1. మంచిర్యాల ప్రాథమిక కల్లు గీత సొసైటీ లాభాలు పెద్దల నోట్లోకి
  2. అనధికారికంగా సొసైటీ కన్వీనర్, గౌరవ సభ్యుల పోస్టుల నియామకం
  3. సభ్యుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రూ.లక్షలు స్వాహా
  4. సంఘం ఆడిటింగ్‌పై ‘ఎక్సైజ్’ దృష్టిసారించాలని సభ్యుల విజ్ఞప్తి

మంచిర్యాల, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : మంచిర్యాలలోని రిజిస్టర్డ్ ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో రోజు రోజుకు కొత్త విషయాలు భయటకు పొక్కుతున్నాయి. ఏండ్లకు ఏండ్లుగా లక్షల రూపాయలు తీసుకుంటుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సొసైటీ తరఫున వచ్చే లాభాలు సభ్యులందరికీ పంచాలి, కానీ కొందరు అక్రమార్కులు సంఘంలో కొంత మందిని సభ్యులుగా చేర్చి వారి పేరిట దోచుకుంటున్నారని తెలుస్తోంది.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో..

మంచిర్యాల కల్లు గీతా పారిశ్రామిక సంఘంలో ఎక్సైజ్ శాఖలో అధికారికంగా బైలా ప్రకారం సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు డైరెక్టర్లుగా మాత్రమే (ఫైవ్ మెన్ కమిటీ) అధికారికంగా ఉన్నారు. మరి ఈ కన్వీనర్ పోస్టు, గౌరవ సభ్యులు అనే వారు ఎక్కడి నుంచి ఊడిపడ్డారో అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు, ఇటు కొంత మంది సంఘ సభ్యులకు సైతం తెలియదు.

సంఘం అభివృద్ధికి పెద్దలు పని చేస్తున్నారనుకున్నాం కానీ సంఘాన్ని దోస్తున్నారనేది ఒకరు కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసేంత వరకు తెలియదు. ఈ తతంగం ఈ పెద్దొళ్ల చేతుల్లోనే జరుగుతుండటం, పై స్థాయిలో జరుగుతున్న విషయం క్షేత్ర స్థాయిలో ఉన్న చాలా మంది గీత వృత్తిని నమ్ముకుని ఉన్న నిరక్ష్యారాస్యులైన సభ్యులకు తెలియకపోవడంతో వారంతా చెప్పింది వింటుండటం వారికి కలిసి వచ్చింది. 

నెలకు రూ. 2.80 లక్షలు ఎవరి చేబుల్లోకి...

మంచిర్యాలలోని కల్లు పారిశ్రామిక సహకార సంఘంలో ఒకరి కోసం కొత్త పోస్టు, దానిని కాపాడుకునేందుకు గౌరవ సభ్యులు మరి కొంత మంది.. ఇదంతా అనధికారికంగానే... సభ్యుల అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షలు మింగుతున్న ఆ కన్వీనర్ పోస్టుతో ఎవరికి లాభం. ఈ పోస్టుకు రూ. 2.80 లక్షలు కల్లు అమ్ముకునేందుకు వేలం పాడిన వ్యక్తే నెల నెలా ఈయనకు ఇవ్వాలంటూ లీజు అగ్రిమెంటులోని ప్రధాన పాయింటు.

ఎందుకు చెల్లించాలనేది చాలా వరకు సభ్యులకే తెలియకపోవడం గమనార్హం. అసలు సంఘం సమావేశాలు జరుగవు, కనీసం ఆడిట్ కూడా జరుపరు. ఈ లక్షల రూపాయలు ఎవరి పాలవుతున్నాయని పాత సభ్యులే కాదు కొత్త సభ్యులకు కూడా తెలియని మిస్టరీ... సంఘం ఆడిటింగ్ మీద ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించాలని పలువురు సభ్యులు కోరుతున్నారు.

ఎవరి లబ్ధికోసం ‘లీజు’ అగ్రిమెంట్లు

మంచిర్యాల గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో 2024, సెప్టెంబర్ 18న సర్వసభ్య సమావేశం నిర్వహించి సొసైటీ తరపున కల్లు అమ్ముకునేందుకు రెండు సంవత్సరాలకు గుర్రం రాజేందర్ గౌడ్ లీజుకు ఒప్పందం చేసుకున్నారు. మొదటి సంవత్సరానికి సంఘానికి రూ. 12.50 లక్షలు (మొదటి విడత రూ. 6.50 లక్షలు, రెండో విడత రూ. 6 లక్షలు), రెండో ఏడాది రూ. 13.25 లక్షలు (మొదటి విడత రూ. 6.75 లక్షలు, రెండో విడత రూ. 6.50 లక్షలు)గా తీర్మానించారు.

ఈ డబ్బులను సంఘ సభ్యులుగా ఉన్న వారికి రెండు విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు భాగానే ఉన్నా అదనంగా రూ. 2.80 లక్షలు నెల నెలా లీజుకు తీసుకున్న వారు కన్వీనర్‌కు చెల్లించాలని అగ్రిమెంటులో రాసుకున్నారు. ఈ డబ్బులు ఎవరికి చెందుతున్నాయోననేది సంఘంలోని సభ్యులకు చాలా వరకు తెలియని విషయం.