07-07-2025 04:56:04 PM
మంత్రి కోమటిరెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదు..
విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలోని కొంతమంది ముస్లిం నాయకులు వారి రాజకీయ లబ్ధి కోసం లతీఫ్ సాబ్ గుట్టపై రోడ్డు వేయకుండా వారి స్వార్థం కోసం అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు మహమ్మద్ ఖయ్యూం బేగ్, మహమ్మద్ ఇబ్రహీం, సయ్యద్ సమద్, మహమ్మద్ బషీరుద్దీన్ లు తెలిపారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... నల్లగొండ పట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతీఫ్ సాబ్ గుట్టతో పాటు బ్రహ్మంగారి గుట్టకు రోడ్డు వేయడానికి రూ.140 కోట్లు మంజూరు చేయించాడని అన్నారు.
ఆదివారం కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని అయిపోయిన తర్వాత కొందరు నాయకులు సొంతంగా ఒక వీడియోను విడుదల చేసి దానిలో వారు హద్దులు మీరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండించారు. మరోసారి ఇటువంటి భాషను మాట్లాడితే సహించేది లేదన్నారు. లతీఫ్ సాబ్ గుట్టపై జరిగే ఉర్సు ఉత్సవ కమిటీ సమావేశంలో ముతవల్లీలు మరియు మైనార్టీ పెద్దలు రోడ్డు వేయాలని గతంలో చాలా సార్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి విన్నవించారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పట్టణమును అభివృద్ధి చేయాలని అభిలాషతో గతంలో ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపించారని వెల్లడించారు.
అయితే తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఆంధ్ర పాలకులు నిధులు ఇవ్వలేదని వివరించారు. 2018 సంవత్సరం ఎన్నికలలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మాజీ ప్రజాప్రతినిధి కోట్ల రూపాయలతో లతీఫ్ సాబ్ గుట్టకు రోడ్డు వేయాలని బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 2023 ఎన్నికలలో మళ్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత లతీఫ్ సబ్ గుట్ట మీదికి రోడ్డు వేయడానికి సర్వే చేయించి వివిధ మార్గాలను పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో ప్రతిపాదించిన మార్గంలో రోడ్డు నిర్మాణం చేస్తే కింద ఉన్న నివాస గృహాలను కోల్పోయే అవకాశం ఉన్నందున, ఉంటున్న గృహాలపై నిర్మాణ సమయంలో రాళ్లు పడే అవకాశం ఉన్నందున ముందు నుంచి కాకుండా గుట్ట వెనుక నుంచి వేస్తే బాగుంటుందని ఇంజనీరింగ్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారని వెల్లడించారు.
అట్టి రోడ్డు కొరకు సర్వే చేయించి సంబంధిత శాఖ సమన్వయంతో పనులు చేపట్టాలని ఆదేశించారని అన్నారు.ఇది తెలియక కొందరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. లతీఫ్ సాబ్ గుట్ట మరియు బ్రహ్మంగారి గుట్ట మీదికి రెండు వేర్వేరుగా రోడ్లను వేయడానికి 140 కోట్ల నిధులతో టెండర్లు పూర్తి చేయించి పనులు ప్రారంభించారని తెలిపారు.అయితే, కొంతమంది ముస్లిం నాయకులు వారి రాజకీయ లబ్ధి కోసం కావాలని లతీఫ్ షాప్ గుట్టకు రోడ్డు వేయకుండా వారి స్వార్థం కోసం అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇన్ని రోజులు కాలయాపన చేసి పనులు మొదలుపెట్టిన తర్వాత వారు పనులను అడ్డుకొని పట్టణంలో సామరస్యంగా మెలుగుతున్న ముస్లిం మరియు హిందువులకు మధ్య వైరం పెంచాలని దురుద్దేశంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
మైనార్టీ సోదరులకు, పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుల తరపున తాము చెబుతున్న వాస్తవాలను గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డు భూములలో సుమారు 750 నుంచి 1000 వరకు ముస్లిం, ముస్లిం మేతరులకు సంబంధించిన పేద కుటుంబాలు నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారని తెలిపారు. ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు వారు చేసే కొన్ని అనాలోచిత చర్యల వలన వారి యొక్క గృహాలు కూల్చివేసే విధంగా చేస్తున్నారని, కావున దీనికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించడం సరైన విధానం కాదన్నారు. ఇది గమనించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఫసహత్ అలీ బాబా, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ మహబూబ్ అలీ, మహమ్మద్ అమేర్, మహమ్మద్ ఖలీల్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ బాబా తదితరులు పాల్గొన్నారు.