calender_icon.png 10 July, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచారం ఇవ్వకుండా వచ్చారు..

10-07-2025 01:12:18 AM

  1. అందుకే భద్రాచల ఈవోపై దాడి!
  2. చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా 
  3. ఎటపాక పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదులు
  4. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిన ఈవో రమాదేవి
  5. ఆలయ సిబ్బందే దాడి చేశారు: పురుషోత్తపట్నంవాసులు

భద్రాచలం, జూలై 9: ముందస్తు సమాచారం ఇవ్వకుండా పురుషోత్తపట్నంలో భద్రాచల ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఆలయ ఈవో రమాదేవి, సిబ్బందితో రావడంతోనే తాము బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయామని చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా తెలిపారు. ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో మంగళవారం జరిగిన ఘటనపై చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా బుధవారం ఎటపాక పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా భద్రాచల రామాలయ ఈవో రమాదేవి, సిబ్బంది పురుషోత్తపట్నం వచ్చారని తెలిపారు. ఈ కారణంగా తాము ఘటన స్థలికి వెళ్లలేదని, ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఈవో రమాదేవి స్పృహతప్పి పడిపోయారని చెప్పారు. పురుషోత్తపట్నంలోని రామాలయ భూముల సమస్య రెండు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఉన్నందున సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇరువర్గాలు సమన్వయం పాటించాలని కోరారు.

కాగా మంగళవారం జరిగిన ఘటనపై అదే రోజు రాత్రి భద్రాచలం దేవస్థానంతోపాటు పురుషోత్తపట్నం గ్రామస్థులు ఒకరిపై మరొకరు ఎటపాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన తోపులాటలో ఈవో రమాదేవి తీవ్ర అస్వస్థతకు గురై భద్రాచలంలోని ఆస్పత్రిలో చేరిన విషయం విధితమే. భద్రాచలంలో వైద్య పరీక్షల అనంతరం మెరుగైన చికిత్స కోసం బుధవారం ఉదయం హైదరాబాద్ తరలించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మంగళవారం రాత్రి ఆస్పత్రిలో ఈవో రమాదేవిని పరామర్శించారు.

ఈవోపై జరిగిన దాడిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల కమిటీలు నిరసనలు చేపట్టాయి. భూముల సమస్యను రెండు రాష్ట్రాలు కలిసి సమస్యను పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ విషయం కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తే ఆయన రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో మాట్లాడారని చెప్పారు. 

దేవస్థాన సిబ్బందే మాపై దాడి చేసింది

పురుషోత్తపట్నం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామస్థులు మాట్లాడారు. దేవస్థాన ఉద్యోగులు, వారు తీసుకొచ్చిన 150మంది ప్రైవేట్ వ్యక్తులే తమపై దాడి చేశారని, తాము ఎవరిపైనా దాడి చేయలేదని ఆరోపించారు. అక్రమ నిర్మాణం చేపడుతున్నారని రామాలయ అధికారులు ఆరోపిస్తున్న ఇల్లు 40 ఏండ్ల క్రితమే నిర్మించినట్లు తెలిపారు.

రెండేండ్ల క్రితం అగ్ని ప్రమాదంలో ఆ ఇల్లు కాలిపోయిందని, ఇప్పుడు అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. పురుషోత్తపట్నం గ్రామం ఏర్పడి 80 ఏండ్లు అవుతున్నదని, రామాలయ అధికారులు అభ్యంతరం తెలుపుతున్న ఇల్లు పురుషోత్తమపట్నం గ్రామ కంఠంలోనే ఉన్నదని వెల్లడించారు. ఆ ఇంటికి గ్రామ పంచాయతీ అనుమతి సైతం ఉన్నదన్నారు.

వివాదంలో ఉన్న ఇంటి యజమాని పుల్లమ్మను ఈవో రమాదేవి వెంట వచ్చిన వారు బలవంతంగా లాగి కింద పడేయంతో ఆమె మూర్ఛపోయిందన్నారు. దీంతో భయంవేసి ఈవో స్పృహ కోల్పోయునట్లు నాటకం ఆడి, తమను దోషులు గా చిత్రీకరించారని ఆరోపించారు. ఈవో చుట్టూ ఆమె వెంట తీసుకొచ్చిన వ్యక్తులే ఉన్నారన్నారు. అక్రమ నిర్మాణం చేపడితే చట్టపరంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలిగానీ, ప్రైవేట్ వ్యక్తులతో వచ్చి  దాడి చేయడం సమంజసం కాదన్నారు.