20-07-2024 12:40:45 AM
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రుణమాఫీని మొదలు పెట్టడంతో రైతులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటుం టే.. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం రుణమాఫీ చేసిందని తెలిపారు. శుక్రవారం గాంధీభవ న్‌లో మాట్లాడుతూ.. ఆగస్టు 15 వరకు రూ. 2 లక్షల వరకు రణమాఫీ పూర్తవుతుందన్నారు.
హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా, కేసీఆర్ సీఎంగా ఉండి 10 ఏళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని, అందులో రైతుల రుణమాఫీ చేసింది కేవలం రూ.26 వేల కోట్లు మాత్రమేనని ఆరోపించారు. సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 6 నెలల్లోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. బీజేపీ పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి దేశంలో ఉన్న రైతులకు ఎన్నివేల కోట్లు రుణమాఫీ చేశారో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని సవాల్ విసిరారు. విజయ్‌మా ల్యా, నీరవ్‌మోదీతోపాటు కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని, అందులో రైతు లు ఎంతమంది ఉన్నారో చెప్పాలన్నారు.
చిరంజీవికి రైతు సమస్యలు పట్టవా?
రైతుల సమస్యల మీద ‘ఖైదీ నంబర్ 150’ పేరుతో సినిమా తీసిన నటుడు చిరంజీవి.. ఢిల్లీలో రైతులు నిరసనలు చేస్తుంటే ఎందుకు స్పందించలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగిందని సినిమా తీసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని.. కానీ ఏనాడు రైతు సమస్యల మీద పోరాడలేదన్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తుంటే రైతుల గురించి ఎందుకు చెప్ప డం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి.. రైతులను హత్య చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేటీఆర్ ఒక ట్వీట్లకే పనికి వస్తాడని, మిగతా వాటికి పనికిరాడని ఎద్దేవా చేశారు.