20-05-2025 01:01:30 AM
ఇబ్రహీంపట్నం, మే 19: నియోజకవర్గ పరిధిలోని రాయపోల్ రోడ్డు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రోడ్డు గుంతల మయంగా, అద్వానంగా మారడంతో వాహనదారులకు నిత్యం ఇబ్బందులు తప్పడంలేదు. ఈ రోడ్డు మార్గంలో తాళ్ళపల్లి గూడ, ఎన్గల్ గూడా, పోల్కంపల్లి, నాగన్ పల్లి, మన్యగూడ, ముకునూర్, దండుమైలారం, నేర్రపల్లి, లింగంపల్లి వివిధ గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.
వివరాల్లోకి వెలితే.. మూడు సంవత్సరాల కింద రాయపోల్ గ్రామంలో రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు, రోడ్డుకు ఇరువైపులా ఇండ్లను, షాప్ లను కూల్చివేశారు. ఈ రోడ్డు నాగార్జున సాగర్ హైవే ఇబ్రహీంపట్నం నుండి విజయవాడ హైవే తూప్రాన్ పేట్ వరకు 21 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు హైవే లను కలిపే ఈ రోడ్డు నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది.
కాగా డబల్ రోడ్డు వేసే క్రమంలో 21 కి.మీ.లలో, రాయపోల్ గ్రామంలో మాత్రం ఒక కిలోమీటర్ రోడ్డును వదిలి, మిగతా మొత్తం రోడ్డు పనులు పూర్తి చేశారు. అయితే రాయపోల్ ఇరువైపులా ఇండ్లను, షాప్ లను కూల్చారు. కానీ నేటికి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టలేదు. దింతో రోడ్డు గుంతల మయంగా, అద్వానంగా తయారవ్వడంతో వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు.
గుంతలుగా మారిన ఈ రోడ్డు తేలికపాటి వర్షానికే రోడ్డంతా చిత్తడిగా, ప్రమాదకరంగా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారిన గ్రామంలో రోడ్డు పరిస్థితి మారడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా రోడ్డు విస్తరణలో ఇండ్లు, షాప్ లు కోల్పోయిన వారికీ పరిహారం అందించాలని కోరుతున్నారు.
న్యాయం చేయాలి..
ఇప్పటివరకు రోడ్డు వెడల్పు చేయలేదు. నాలా చాలా మంది షాప్ లను, ఇండ్లను కూల్చారు. కానీ ఏలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. కమర్షియల్ ఏరియాలో ఉన్న నా షాప్ ను కూల్చడంతో నాకు చాలా నష్టం వాటిల్లింది. నష్టపోయిన వారిని ప్రభుత్వం గుర్తించి బాధితులకు తగు న్యాయం చేయాలనీకోరుతున్నాము.
బాధితుడు, మంకాల అశోక్, రాయపోల్ గ్రామం కొత్త బిల్లు మంజూరు కావాలి..
మూడేళ్ల క్రితం ఇబ్రహీంపట్నం (సాగర్ హైవే) నుండి తూప్రాన్ పెట్ (విజయవాడ హైవే) వరకు డబల్ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లను వేశారు. కానీ, ఆ సమయంలో రాయపోల్ లో మాత్రం డబల్ రోడ్లకి అడ్డంగా ఇండ్లు, షాపులు ఉండటంతో, నాటిని తొలగించే నాటికి అక్కడ రోడ్డు పనులు పూర్తయ్యాయి.
ఇక్కడ రోడ్డు అలాగే పెండింగ్లో ఉండిపోయింది. ప్రస్తుతం ఈ రోడ్డు పనులు జరగాలంటే మళ్లీ కొత్తగా బిల్లు మంజూరు చేయించుకోవాల్సి ఉంటుంది. కుమార్, ఆర్‌అండ్‌బి ఏఈఈ