19-12-2025 12:00:00 AM
నంగునూరు, డిసెంబర్ 18: గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు పొందేందుకు లక్షలలో ఖర్చుచేసి ఓటమిపాలైన సందర్భాలు కోకోలలుగా కనిపిస్తున్నాయి. భూములు, ఆస్తులు అమ్ముకొని పోటీ పడగా అదృష్టం కలిసి రాక పదవులు చేపట్టలేక పోయారు. కానీ గ్రామం నుంచి కొన్నేళ్ల క్రితం పక్క గ్రామానికి వలస వెళ్లిన వారిని పదవులు వరించాయి.
ఒకే ఇంట్లో ముగ్గురు వార్డు సభ్యులు పదవులు చేపట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అప్పలాయ చెరువు గ్రామంలో చోటుచేసుకుంది. అప్పలాయ చెరువు గ్రామం నుంచి కొన్నేళ్ల క్రితం సమీప గ్రామమైన రాంపూర్ కు వలస వెళ్లిన రాజబోయిన లలిత కుటుంబం అక్కడే ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయినప్పటికీ వారికి అప్పలయ చెరువు గ్రామంలోనే ఓటు నమోదు అయినవి.
ఆ గ్రామంలో ఓట్లు నమోదై ఉండటమే వారికి కలిసొచ్చిన రాజకీయ అవకాశం. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో లలిత (తల్లి), రాకేష్ (కుమారుడు), రమ్య (కుమార్తె) లు అప్పలాయ చెరువు గ్రామంలో వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే 8వ వార్డు లో నామినేషన్ వేసిన రమ్య ఏకగ్రీవం అయింది. లలిత 5వ వార్డు, రాకేష్ 3వ వార్డు ఎన్నికల బరిలో నిలిచారు.
వీరందరూ గ్రామంలో నివాసం ఉండరని తెలిసిన ఓటర్లు మాత్రం వారికే ఓట్లు వేసి గెలిపించారు. ఈ గ్రామంలో రెడ్డి, గౌడ, ముదిరాజ్ కులాల ప్రజలు మాత్రమే ఉం టారు. ముదిరాజు కులస్తుల ఐక్యత శాప మా, లోపమా అనే ఆలోచనలో పడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వార్డు సభ్యులుగా ఎన్నుకోవడం గ్రామస్తులకు జన్మతః రుణపడి ఉంటామని వార్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.