22-12-2025 01:18:06 AM
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
కేసముద్రం, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రోడ్డు విస్తరణలో భాగంగా పలువురు నిరుపేదలకు ఉన్న కొద్దిపాటి స్థలం, ఇల్లు పూర్తిగా కూల్పోయే పరిస్థితి నెలకొంది. అలాంటివారికి ప్ర త్యామ్నాయ మార్గాలు చూపకుండా కనీసం ఒక రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండా కూల్చి వేస్తుండడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో పలురోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా కేసముద్రం పట్టణం బైపాస్ రోడ్డు నిర్మాణం విస్తరణ పనుల్లో చిన్నం సత్తెమ్మ అనే మహిళకు చెందిన 266 గజాల ఇంటి స్థలం పూర్తిగా కోల్పోయింది.
1993లో కొనుగోలు చేసిన భూమిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న క్రమంలో తన కొడుకు సాంబయ్య ఆరేళ్ల క్రితం చనిపోగా, తనతో పాటు కోడలు జ్యోతి, ఇద్దరు మనుమలు లవన్ కుమార్, పవన్ కుమార్, వారి పిల్లలు జీవిస్తున్నారని, ఒక్క గజం భూమి కూడా మిగలకుండా రోడ్డు కోసం తీసుకున్నారని, దీనితో తమ కుటుంబం పూర్తిగా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. లక్షల రూపాయల భూమి కళ్ళేదుటే రోడ్డు పాలు కావడంతో ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అం తా ఇంతా కాదు. తనలాంటి వారికి ప్రభుత్వం తగిన పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఆమె కోరింది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం ఇవ్వాలని, జీవనోపాధి చూపాలని సత్తమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.