31-12-2025 01:12:10 AM
వన్డే ప్రపంచకప్ విజయం.. ఇప్పుడు శ్రీలంక మహిళలపై టీ20 సిరీస్ 5 కైవసం... వెరసి 2025ను భారత మహిళల క్రికెట్ జట్టు ఘనంగా ముగించింది. చివరి టీ ట్వంటీలో సైతం లంకను ఓడించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. బ్యాటింగ్‌లో హర్మన్ ప్రీత్‌కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మంచి స్కోరు అందిస్తే... బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన భారత్ 15 పరుగుల తేడాతో విజయాన్ని అందించారు.
కాగా భారత మహిళల జట్టు 5 టీ20 సిరీస్ గెలవడం ఇది మూడోసారి. గతంలోవెస్టిండీస్‌పై బంగ్లాదేశ్‌పైనా ఈ ఘనత సాధించింది. అలాగే శ్రీలంక జట్టుపై 25 టీ20 విజయాలతో ఒక జట్టుపై అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన నాలుగో టీంగా నిలిచింది.
ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లు విశాఖలో జరిగాయి. తొలి టీ ట్వంటీలో 8 వికెట్ల తేడాతోనూ, రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతోనూ భారత్ గెలిచింది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లకు తిరువునంత పురం ఆతిథ్యమివ్వగా.. మూడో టీ20లో 8 వికెట్లతోనూ, నాలుగో మ్యాచ్‌లో 30 పరుగులతోనూ విజయం సాధించింది. సిరీస్‌లో 236 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన ఓపెనర్ షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
5 సిరీస్ కైవసం
తిరువునంతపురం, డిసెంబర్ 30: టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్ గెలవడంతో భారత్ తుది జట్టులో పలు మార్పులు చేసిం ది. స్టార్ ప్లేయర్స్ స్మృతి మంధాన, రేణుకా సింగ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహా రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ తోనే కమిలిని అరంగేట్రం చేసింది. గత మూడు మ్యాచ్ లలో అదరగొట్టిన భారత కీలక బ్యాటర్లు చివరి టీ20లో విఫలమయ్యా రు.
హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన షెఫాలీ వర్మ కేవలం 5 పరుగులకే ఔటవగా... కమిలిని 12 , హ్యార్లిన్ డియోల్ 13 పరుగులు వెనుదిరిగారు. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయినప్పటకీ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. ఈ సిరీస్ లో పెద్ద గా రాణించని ఆమె చివరి మ్యాచ్‌లో మాత్రం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లంక బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ హాఫ్ సెంచరీ సాధించింది.
రిఛా ఘోష్ 5, దీప్తి శర్మ 7 పరుగులకే ఔటవగా.. అమన్ జోత్ , హర్మన్ కు చక్కని సపోర్ట్ ఇచ్చింది. వీరిద్దరూ ఆరో వికెట్ కు కేవలం 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ 68 (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులకు ఔటయింది. దీంతో భారత్ స్కోరు 160 దాటడం కష్టమే అనిపించింది. అయితే చివర్లో హైదరాబాదీ ప్లేయర్ అరుంధతి రెడ్డి మెరుపులు మెరిపించింది. కేవలం 11 బంతుల్లోనే 27 నాటౌట్ (4 ఫోర్లు, 1 సిక్సర్ ) చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దిల్హరి 2 , రష్మిక 2, ఆటపట్టు 2 వికెట్లు పడగొట్టారు.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (2) రెండో ఓవర్లోనే వెనుదిరిగింది. అయితే మరో ఓపెనర్ హాసిని పెరీరా, దులానీ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. హాసిని, దులానీ రెండో వికెట్ కు 56 బంతుల్లో 79 పరుగులు జోడించారు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అమన్ జోత్ కౌర్ విడగొట్టింది. దులానీ 50 ( 8 ఫోర్లు ) పరుగులకు ఔట్ చేసింది. ఇక్కడ నుంచీ శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. హాసిని దూకుడుగా ఆడుతున్నా మరోవైపు మిగిలిన బ్యాటర్లు వరుసగా ఔటయ్యారు.
హాసిని పెరీరా 65 (42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ ) పరుగులకు ఔటవడంతో లంక ఓటమి ఖాయమైంది. చివర్లో భారత ఫీల్డర్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేసి లంకను కట్టడి చేశారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో వికెట్లకు పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, స్నేహా రాణా, శ్రీచరణి, అమన్ జోత్ కౌర్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.
స్కోరు బోర్డు:
భారత్ ఇన్నింగ్స్: 175/7 (హర్మన్‌ప్రీత్ కౌర్ 68, అరుంధతి రెడ్డి 27 నాటౌట్, అమన్‌జోత్ కౌర్ 21; దిల్హరి 2/11, రష్మిక 2/42, చమరి ఆటపట్టు 2/21)
శ్రీలంక ఇన్నింగ్స్: 160/7 (హాసిని పెరీరా 65, దులాని 50, రష్మిక 14 నాటౌట్; దీప్తి శర్మ 1/28, అరుంధతి రెడ్డి 1/16, అమన్‌జోత్ కౌర్ 1/17)