22-09-2025 10:53:53 PM
ఒకే రాత్రి నాలుగైదు ఇళ్లలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగ
స్థానికుల సాహసంతో పట్టుబట్టి పోలీసుల చెంతకు
చివ్వేంల: చివ్వేంల మండలంలోని కొండల రాయని గూడెంలో వరుస దొంగతనాలు చోటుచేసుకుని గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి గ్రామంలోని నాలుగైదు ఇళ్లలోకి ప్రవేశించి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. మొత్తం కలిపి ఐదు నుంచి ఆరు తులాల బంగారం దొంగతనానికి గురైనట్టు బాధిత కుటుంబాలు తెలిపాయి. దొంగతనం జరిగిన విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు అప్రమత్తమై వెంబడించారు.
ఆ సమయంలో నిందితుడు గ్రామంలోని గడ్డివాంలో దాక్కోవడానికి ప్రయత్నించగా, స్థానిక యువకులు అతడిని వెంటాడి పట్టుకున్నారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో నిందితుడిని చివ్వేంల పోలీసులకు అప్పగించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారా లేదా అన్న వివరాలు వెల్లడించాల్సి ఉంది.గ్రామంలో వరుస దొంగతనాలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.