calender_icon.png 11 November, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లా వల్లే ఈ ఎన్నిక

19-05-2024 01:33:06 AM

బీఆర్‌ఎస్ వాళ్లు ఓట్లు ఎట్లడుగుతరు?

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రశ్న

నిరుద్యోగులను మధ్యలో వదిలేశాడని పల్లాపై ధ్వజం

అవకాశం ఇస్తే జాబ్ క్యాలెండర్ విడుదలకు కృషి చేస్తానని వెల్లడి

జనగామ/జయశంకర్ భూపాలపల్లి, మే 18 (విజయక్రాంతి) : నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని నమ్మించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని, మళ్లీ బీఆర్‌ఎస్ నాయకులు ఓట్లు ఎలా అడుగుతారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అభిప్రాయపడ్డారు. మూడేళ్లలో ఆ పదవికి న్యాయం చేయని బీఆర్‌ఎస్‌కు మళ్లీ ఓటెందుకు వేయాలో ఆ పార్టీ నాయకులను ఓటర్లు ప్రశ్నించాలని మల్లన్న సూచించారు. శనివారం జనగామ విజయ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా 15 వేల దొంగ ఓట్లు వేయించుకుని తనపై అక్రమంగా గెలిచారని గుర్తు చేశారు. జనగామ ఎమ్మెల్యేగా కూడా దొంగ ఓట్లతోనే గెలిచారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరిగి ఓట్లు అభ్యర్థించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించి తనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం తనతోనే సాధ్యమన్నారు. త్వరలోనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేసీఆర్ చంచల్‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని మల్లన్న అన్నారు.

‘ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు’ : కొమ్మూరి

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైనప్పటికీ కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండొద్దని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సూచించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్సే తన అపజయానికి కొంత కారణమైందని చెప్పారు. ఎలాగూ గెలుస్తామనే ధీమాతో కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే ఓట్లు రావన్నారు.

అందరం కష్టపడి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  సమావేశంలో పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు భవానీరెడ్డి, డాక్టర్ రాజమౌళి, కొండల్‌రెడ్డి, మేడ శ్రీనివాస్, వంగాల కల్యాణి మల్లారెడ్డి, జక్కుల అనితవేణుమాధవ్, బనుక శివరాజ్‌యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అవకాశం ఇస్తే జాబ్ క్యాలెండర్ విడుదలకు కృషి చేస్తా

రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిండా ముంచాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు. భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పదేళ్లలో రూ.6లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాడినందుకు తనను జైలుకు పంపారని, కాని కవిత లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లి తెలంగాణ ఆడబిడ్డలకు తలవంపులు తెచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.  ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదలకు కృషిచేస్తానని, రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రయత్నం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలుకు కృషిచేస్తానన్నారు.

317ఓవో ద్వారా ఉద్యోగులకు ఇబ్బందులు కలిగాయని వాటిని సరిచేస్తానన్నారు.కేటీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో పట్టభద్రులు లేరని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రజల పక్షాన ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని, ఆయన గెలుపుతో నిరుద్యోగుల భవిష్యత్‌కు బంగారు బాటలు పడుతాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలోని పట్టభద్రులు గొప్పగా ఆలోచనచేసి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు.