29-11-2025 12:51:46 AM
సురేశ్ ప్రొడక్షన్స్ డీ సురేశ్‌బాబు సమర్పణలో వస్తున్న కొత్త చిత్రం ‘పతంగ్’. పతంగుల పోటీ కథాంశంగా రూపుదిద్దుకున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇది. సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ముఖ్యతారాగణం. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ పాటను మూవీటీమ్ శుక్రవారం విడుదల చేయగా, ఈ కార్యక్రమానికి సురేశ్‌బాబు అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. “కొత్తతరం అంతా కలిసి ఈ సినిమాను ఎంతో ఉన్నతంగా చేశారు. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది” అన్నారు. నిర్మాత నాని బండ్రెడ్డి, సంగీత దర్శకుడు జోస్ జిమ్మి, పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, నిర్మాతలు, చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.