12-10-2025 12:31:26 AM
పెళ్లంటే పందిళ్లు, సందళ్లు తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు అన్నది ఒకప్పటి పద్ధతి. ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ కార్యక్రమాలు, ఖరీదైన ఫంక్షన్ హాళ్లు, లెక్కకు మిక్కిలి వంటకాలు ఇదీ ఇప్పటి పద్ధతి. వెరసి ఇప్పుడు పెళ్లంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. దీనికి తోడు పెళ్లి విషయంలో పిల్లలదే పెత్తనం కావడం వారి అభీష్టాలను తల్లిదండ్రులు, కుటుంబీకులు గౌరవించక తప్పని పరిస్థితి నెలకొనడంతో సంప్రదాయానికి సంకెళ్లు వేసినట్లు అయ్యింది. అలాగే ప్రస్తుతం యువత పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తూ దానికై పరవళ్లు తొక్కుతున్నారు.
వివాహ సంప్రదాయంలో మత, సాం స్కృతిక కట్టుబాట్లను పక్కన పెట్టి, ఆధునికత, వ్యక్తిగత స్వాతంత్య్రం, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దీనిలో భాగంగానే వివా హ ఆహ్వానాలు, ఆహార పద్ధతులు, దుస్తులు, కల్యాణ తంతు, అందుకు అయ్యే ఖర్చు వంటి అనేక అంశాల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాంకేతికత అభివృ ద్ధి, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, అందరికన్నా గొప్ప అనే భావన ఈ మార్పులకు కారణమవుతున్నాయి.
గుమ్మం దాటిన వివాహం
ఒకప్పుడు పెళ్లిళ్లు- ఇంటి గుమ్మం ముందు లేదా సమీపంలోని ఖాళీ స్థలాలు, మైదానాల్లో జరిగేవి. కాదనకుంటే సమీపంలోని ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోని కల్యాణ వేదికల వద్ద నిర్వహించేవారు. కాలంతోపాటు పెళ్లి వేడుకలు నట్టింటి నుంచి నాన్ ఏసీ, ఏసీ ఫంక్షన్ హాళ్లలోకి చేరాయి. మంచి కల్యాణ వేదికలకున్న ఖాళీ తేదీలను చూసుకుని మరీ వివాహ ముహూర్తాలు నిర్ణయించుకుంటున్న ఉదంతాలు అనేకం. ఎక్కడా ఏ వేదిక దొరకకుంటే చివరికి హోటళ్లలో వివాహాలు జరిపించేందుకు సిద్ధపడుతున్నారు.
ఆహ్వానాలు అనేక మార్పులు
గతంలో వివాహం ఎంత సంప్రదాయం గా ఉండేదో ఆహ్వానాలను పంపే తంతు కూడా అదేవిధంగా ఉండేది. కానీ రాను రాను అది కూడా గణనీయమైన మార్పులకు గురైంది. చాలాకాలం క్రితం మధ్య భారతదేశంలో ఆహ్వానాలను పసుపు బియ్యం (పీలే చావల్) రూపంలో పంపేవారు. పసుపు బియ్యం వివాహాన్ని ప్రారం భించే శుభ చిహ్నం. ఈ సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అనుసరిస్తున్నారు.
ఆపై లగ్నపత్రికను పంపే సంప్రదాయం వచ్చింది. ఇక ఇప్పుడు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా ఆహ్వానా లు పంపడం సర్వసాధారణమైంది. అంతేకాకుండా ప్రస్తుతం వివాహ వ్బుసైట్లను కూడా అభివృద్ధి చేశారు. ఈ వ్బుసైట్లలో వివాహం గురించిన సమాచారం ఉంటుం ది. అతిథులు ఎప్పుడైనా వీటిని సందర్శించి దాని గురించిన అన్ని నవీకరణలను పొందవచ్చు. అతిథులు వివాహానికి హాజరు అవుతారా లేదా అని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ వ్బుసైట్లలో చిత్రాలతో పాటు వివాహం గురించి అవసరమైన సమాచారమంతా ఉంటుంది.
మారిన ట్రెండ్
ఒకప్పుడు పెళ్లికి తోడు రిసెప్షన్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మెహిందీ, సంగీత్, హల్దీ అని, ఇతర ఉత్తరాది సంప్రదాయాలు అని పెళ్లికి 2, 3 రోజుల నుంచే సందడి ఆరం భం అవుతోంది. దీనికి తోడు ప్రీ వెడ్డింగ్ షూ ట్లు మరో ట్రెండ్. పెళ్లికి ముందు ఫొటోషూట్లు, వీడియో షూట్లు చేయడం, వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం వంటివి కూడా ఒక కొత్త సంప్రదాయంగా మారిపోయింది.
కల్యాణతంతు కనిపించే మార్పులెన్నో..
శాస్త్రోక్తంగా జరగాల్సిన కల్యాణతంతులో వెకిలి నృత్యాలు, వేదమంత్రాలు చదివే చోట రణగొణ ధ్వనులు వినిపించడం, మాంగళ్యధారణ జరిగే సమ యంలో పురోహితుడి కంటే ఫొటోగ్రాపర్ చొరవ ఎక్కువ గా ఉంటుంది. అసలు ఫొటోల కోసమే పెళ్లి అన్న రీతిగా మారిపోయింది.. అంటే పరిస్థితి ఎలా మారింధో అర్థం చేసుకోవచ్చు.
వివాహాల్లో ఆధునిక పోకడలు
పెళ్లిళ్లలో డ్రోన్లతో వీడియో షూట్ చేయడంతో పాటు మేకప్ ఖర్చులు హద్దులు దాటుతున్నాయి. వధూవరులు, బంధువుల మేకప్కు సైతం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆధునిక పోకడలు పెళ్లి తతంగంలోకి చొచ్చుకొచ్చాయి. నేటితరానికి ప్రతీదీ సెలబ్రేషనే. ఇక బ్యాచిలర్ పార్టీలంటూ యువత మరికొంత వెచ్చిస్తోంది.
పెరుగుతున్న ఆర్థిక భారం
కళ్లు మిరమిట్లు గొలిపే విద్యుత్తు దీపాలకాంతులు, ఆహ్వానితులు కాకుండా ఇతరుల ను రానీయకుండా ప్రైవేటు సెక్యురిటీ గార్డు లు బౌన్సర్లు, బ్రాస్ బ్యాండ్లు, బారాత్లు, అద్దె కు విలాసవంతమైన కార్లు, గుర్రపు బండ్లు ఇలా తమ సంప్రదాయాల్లో ఉన్న వాటికి- లేనివాటిని కూడా జోడించి అదనపు ఖర్చుకు వెనుకాడడంలేదు. దీంతో రాను రాను ఆర్థిక భారం పెరుగుతుంది.
సింగారానికే బంగారం!
వజ్రాలు పొదిగిన పతకాలను, బంగారు నలుపు పూసలను వాడటం, రకరకాల హారా లు, నెక్లెసులు, ఫ్యాషన్లకు అనుగుణం గా మంగళసూత్రాల్లో మార్పులు తీసుకొచ్చారు. మొత్తానికి సింగారానికే బంగారం అన్నట్లుగా మార్చేశారనడంలో సందేహం లేదు.
కట్టుబాట్లను కాలరాస్తూ ..
ఒకప్పుడు వివాహ తంతు కుటుంబ బాధ్యతగా ఉండేది.. కానీ అదే ఇప్పుడు వ్యక్తిగత ఎంపికలకు ప్రాధాన్యత నిస్తుంది. కొన్ని వివాహాల్లో సంప్రదాయక కట్టుబాట్లను కాలరాస్తూ తమకు తోస్తున్న ఆలోచనలను అనుసరిస్తున్నారు. మారుతున్న సామాజిక విలువలు, ఆధునిక జీవన శైలి వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రేమ వివాహాలు, లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లాంటివి ఆమోదం పొందడం, సంప్రదాయ గృహ జీవితానికి భిన్నంగా మారుతున్నాయి.
ఇది ఇలా ఉండగా సనాతనధర్మంలో ప్రతిదీ ఒక అర్థవంతంగా నిర్వహింపబడుతుందని కల్యాణతంతు కూడా అందులో భాగమేనని తప్పక సంప్రదాయం ప్రకారమే దానిని నిర్వహించాలని అప్పుడే దంపతులు అన్యోన్యంగా ఉంటారని ధర్మ పరిరక్షకులు చెబుతున్నారు.
పప్పన్నం నుంచి కానుకలిచ్చే వరకు..
ఒకప్పుడు పెళ్లి ప్రస్తావన వస్తే పప్ప న్నం ఎప్పుడు తినిపిస్తున్నారు.. అనే వా రు. కానీ ఇప్పటి పెళ్లిళ్లలో ప్లేటులో పట్టనన్ని ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. వందకుగాపైగా రుచులు వడ్డిస్తున్న వివాహాలు లేకపోలేదు. కేటరింగ్ వారికి ఒక ప్లేట్కు దాదాపు రెండు వేల రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. పెళ్లికి వచ్చిన వారికి గతంలో తాం బులం కవర్లో పెట్టి ఇచ్చేవారు.
ఇప్పుడు వివిధ రకాల రిటర్న్ గిఫ్ట్లు వచ్చిన వారి స్థాయి ఆధారంగా ఇస్తున్నారు. ఇందుకోసం కూడా తమ ఆర్థిక పరిస్థితులను పక్కనపెట్టి మరీ భారీగా ఖర్చు చేస్తున్నారు. పెళ్లికి వచ్చిన వారు ఏమనుకుంటారో అని ఖరీదైన కానుకలనూ అందజేస్తున్నారు. సంపన్నులైతే వధూవరులను రూ.లక్షలు వెచ్చించి హెలికాప్టర్లలోనూ తీసుకువస్తున్నారు.