calender_icon.png 20 January, 2026 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది పెద్దల డే కేర్!

25-11-2024 12:00:00 AM

అనగనగా ఓ ఊరు. ఆ ఊరు నిండా అరవైదాటిన పెద్దలు. పిల్లలంతా పనుల కోసం, చదువుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లారు. వయసుపైబడిన పెద్దలు ఒంటరితనంతో.. ఏదో కోల్పోయిన బాధతో ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి.. వాళ్ల ఒంటరితనాన్ని దూరం చేయడానికి కమ్యూనిటీ హాల్‌ను నిర్మించారు. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు పిల్లల్ని ఉదయం డే కేర్‌లో దింపి.. సాయంత్రం ఇంటికి తీసుకెళుతుంటారు ఇది మనకు తెలిసిందే.

అదే విధంగా పంజాబ్‌లోని కక్కర్ గ్రామస్తులూ, ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామల వారూ పొలాలకు వెళ్లే ముందు ఇంట్లోని పెద్దవాళ్లని కక్కర్‌లోని గురుద్వారా వద్ద దింపుతారు. సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు తిరిగి తీసుకెళుతుంటారు. ఎందుకో తెలుసా.. నాలుగువేల మంది నివసించే కక్కర్‌లో దాదాపు వందమంది దాకా అరవైఏళ్లకు పైబడిన వారున్నారు.

తమ పిల్లలు పొలాలకు వెళ్లడంతో ఇళ్లకే పరిమితమైన ఆ వృద్ధులు ఒంటరితనంతో బాధపడేవారు. మరోవైపు ఐదేళ్లలోపు పిల్లలున్న వారు వాళ్లని ఇళ్ళలో వదిలి పనులకు వెళ్లలేకపోయేవారట. ఆ గ్రామానికి చెందిన కర్నల్ సింగ్ ఇదంతా గమనించాడు.

నిత్యం గురుద్వారాకు వెళ్లి ప్రార్థన చేసే పెద్దవాళ్లకోసం అక్కడే ఓ కమ్యూనిటీ హాల్‌నును నిర్మించి.. ఉదయం ప్రార్థన అవ్వగానే సాయం త్రం వరకూ అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశాడు. ప్రస్తుతం కక్కర్‌లోని వృద్ధులు ఉదయం నుంచి సాయత్రం వరకూ గురుద్వారాలోనే ఉంటారు. ఆడుతూ పాడుతూ అందరూ కలిసి టీ, కాఫీలు తాగుతుంటారు. తలా ఒక పని చేస్తూ వంట పూర్తి చేసి అక్కడే తినేస్తారు.

కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చేసేవారంతా ఐదేళ్లలోపు పిల్లల్ని కూడా చూసుకుంటున్నారు. అంతేకాదు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తమ ఇళ్లలో ఒంటరి వృద్ధుల్ని గురుద్వారా వద్ద దింపి వెళుతున్నారు. ‘వృద్ధులకు కాలక్షేపంగా.. పనులకు వెళ్లే పిల్లలకు ధైర్యంగా ఉంటుందని’ అంటున్నారు కర్నల్ సింగ్.