30-09-2025 12:15:43 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కుండపోత వర్షాలకు నగరం వణికిపోతుంటే, నాలాల కబ్జాలు కాలనీ వాసుల పాలిట శాపంగా మారుతున్నాయి. అక్రమ నిర్మాణాలు వరద నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తుండటంతో, తమ నివాస ప్రాంతాలు నిట్టనిలువునా మునిగిపోతున్నాయంటూ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వరద ముంపు, ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
మొత్తం 29 ఫిర్యాదులు అందగా, వాటిలో అత్యధికం నాలాల ఆక్రమణలకు సంబంధించినవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అదనపు కమిషనర్ ఎన్. అశోక్‌కుమార్ ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించారు. హైడ్రా ప్రజావాణికి వచ్చిన ప్రధాన ఫిర్యాదులు పరిశీలిస్తే బేగంపేటలోని మెథడిస్ట్ కాలనీని వరద ముంచెత్తుతోంది.
రైల్వే స్టేషన్, కంట్రీ క్లబ్, కుందన్‌బాగ్ నుంచి వచ్చే వరద మొత్తం కాలనీలోనే నిలిచిపోతోంది. నీరు సాఫీగా వెళ్లే మార్గంలో నిర్మాణాలు జరగడమే ఇందుకు కారణం అంటూ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాపోయింది. అలాగే మేడ్చ ల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని జోడిమెట్ల వద్ద ఉన్న నాలాను మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీ ఆక్రమించింది. దీంతో వర్షపు నీరంతా రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ము రుగునీరు రోజుల తరబడి నిలిచిపోతోంది, అని హిగిరి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.