calender_icon.png 8 October, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా సినీప్రయాణంలో ఈ పాత్ర ప్రత్యేకం

08-10-2025 12:31:10 AM

రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు విశేష స్పందన లభించింది.

విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్రబృందం వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాయకానాయికలతోపాటు దర్శకుడు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను పోషించిన ఆర్‌పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) అధికారి పాత్ర సరికొత్తగా ఉంటుంది. ఇది నా సినీ ప్రయాణంలో ప్రత్యేకమైన పాత్ర.

దర్శకుడు భాను ప్రతిభావంతుడు. ఏదైనా సన్నివేశాలను ఇంకా మెరుగ్గా చేయాలని షూటింగ్ టైమ్‌లో చెప్పినప్పటికీ ఎక్కువగా సమయం తీసుకుకోడు. చాలా వేగంగా మార్పులు చేయగలడు. భీమ్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. వినోదం, మాస్ అంశాలతోపాటు హృదయాలను హత్తుకునే కుటుంబ భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది” అని తెలిపారు. 

రవితేజ నొప్పిని భరిస్తూ షూట్‌లో పాల్గొన్నారు: శ్రీలీల 

“ఈ సినిమాలో నేను సైన్స్ టీచర్‌గా కనిపిస్తాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయి పాత్ర నాది. నా మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఉన్నందునే ఈ క్యారెక్టర్‌ను ఓకే చేశాను. స్క్రిప్ట్ చదివినప్పుడే చాలా నవ్వుకున్నాను. సెట్‌లో ఆ నవ్వులు రెట్టింపయ్యాయి. రవితేజతో కలిసి నటించడం చాలా ఆనందకరమైన అనుభవం. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుంది.

అత్యంత ఆహ్లాదకర మైన సహనటుల్లో ఆయన ఒకరు. రవితేజ ఎంతో అంకితభావం గల నటుడు. కుడిభుజం నొప్పిగా ఉన్నప్పటికీ ఆ బాధ తెలియనీయకుండా ‘తూ మేరా లవర్’ పాటను పూర్తి చేశారు. షూట్ పూర్తయిన తర్వాతే హాస్పిటల్‌కు వెళ్లారు. అప్పుడు సర్జరీ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేస్తే కానీ, చెయ్యి సెట్ కాని పరిస్థితుల్లోనూ పనిచేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనం” అని శ్రీలీల అన్నారు. 

పాటను తప్పుగా అర్థం చేసుకున్నారు: దర్శకుడు భాను 

డైరెక్టర్ భాను మాట్లాడుతూ.. “టైటిల్ ఆలోచన రవితేజ నుంచే వచ్చింది. దానికి ‘మనదే ఇదంతా’ అనే ట్యాగ్‌లైన్‌ను నేను జోడించాను. రాజేంద్రప్రసాద్ వినోదభరితమైన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలోని ‘ఓలే ఓలే గుంట..’ పాట సాహిత్యంలో బూతులు ధ్వనించాయని ఇటీవల చర్చ జరిగింది.

అందరూ సాహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. సినిమా విడుదల తర్వాత కథ తెలుసుకున్నవాళ్లు, పాట పూర్తిగా విన్నవాళ్లు అందులో పాజిటివ్ వైబ్ ఉందన్న విషయాన్ని తప్పకుండా గ్రహిస్తారు” అని తెలిపారు.