calender_icon.png 6 December, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారెడిమిల్లిది ఎన్‌కౌంటర్ కాదు..హిడ్మాపై హత్యాకాండ?!

06-12-2025 12:11:20 AM

  1. చికిత్స కోసం విజయవాడకు వస్తే..
  2. నిరాయుధుడైన హిడ్మాను చిత్రహింసలు పెట్టి.. మట్టుబెట్టారు..
  3. ఆయన మర్డర్‌కు కలపవ్యాపారి,బిల్డర్, ఐటీడీఏ కాంట్రక్టరే కారణం
  4. దేవ్‌జీ కారణమన్న మాజీ ఎమ్మెల్యే ఆరోపణ కుట్రే..
  5. మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు
  6. ఆలస్యంగా వెలుగులోకి నవంబర్ 27నాటి లేఖ

చర్ల, డిసెంబర్ 5: చికిత్స కోసం విజయవాడకు వచ్చి, ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న, నిరాయుధుడైన మావోయిస్టు అగ్రనేత హిడ్మాను ఏపీ పోలీసులు పట్టుకుని, మారేడుమిల్లిలో అతనిపై హత్యాకాండ సాగించారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. చిత్రహింసలు పెట్టి హిడ్మాతోసహా 13 మందిని పోలీసులే చంపేసి, ఎన్‌కౌంటర్‌గా మార్చారని ఆరోపించింది.

ఆయన మర్డర్‌కు ఓ కలప వ్యాపారి, బిల్డర్, ఐటీడీఏ ఓ కాంట్రాక్టరే కారణమని మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జెడ్‌సీ) కార్యదర్శి వికల్ప్ పేరుతో నవంబర్ 27వ తేదీన విడుదల చేసిన ఓ లేఖ ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు అగ్రనేతలే దీని వెనుక ఉన్నారన్న ప్రచారాన్ని ఖండించింది.

నిరాయుధంగా బంధించి, చిత్రహింసలు..

సీపీఐ (మావోయిస్ట్) అగ్ర నాయకుడు మద్వి హిడ్మా, అతని భార్య రాజే, ఇతరులను విజయవాడలో నిరాయుధంగా బంధించి, చిత్రహింసలు పెట్టి, తరువాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు నకిలీ ఎన్కౌంటర్‌లో చంపారని సీపీఐ (మావోయిస్ట్) పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి ఆరోపించారు.

శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో, హిడ్మా తన భార్య, ఇతరులతో కలిసి స్థానిక ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం విజయవాడకు వెళ్లారని ఆయన అన్నారు. కొంతమంది దేశద్రోహులు అతని ఆచూకీని పోలీసులకు లీక్ చేశారని, నవంబర్ 15న హిడ్మాతో సహా మిగతా మావోయిస్టులను ఆసుపత్రిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. 

కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమే

తర్వాత, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆంధ్ర ఎస్‌ఐబీ ద్వారా హిడ్మా, ఇతరులను మారేడుమిల్లి అడవులలో పోలీసులు చంపారని చెప్పారు. అతని హత్య తర్వాత, అతను ఎన్కౌంటర్‌లో మరణించారని, అతని నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నామని మీడియాలో తప్పుడు కథనం వ్యాపించిందని పేర్కొన్నారు.

అదేవిధంగా, మావోయిస్టు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టెక్ శంకర్, మృతిచెందిన మిగతావారు కూడా రంపచోడవరంలో నకిలీ ఎన్కౌంటర్‌కు ముం దు పట్టుబడ్డారని మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై ఫాసిస్ట్ దురాగతాలను కొనసాగిస్తోందని, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చడానికి మావోయిస్టులను చంపు తోందని పేర్కొన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్?

‘హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్. హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పాడన్నది అవాస్తవం. అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి మాతోనే ఉన్నారు. వీళ్లు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం’ అని ప్రకటనలో పేర్కొంది.

హిడ్మా హత్యకు కోసాల్ అనే వ్యక్తి ముఖ్యకారణమని, విజయవాడకు చెందిన కలపవ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, ఐటీడీఏకు చెందిన మరో కాంట్రక్టర్ ఇందుకు కారకులని తెలిపింది. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా విజయవాడకు హిడ్మా వెళ్లారు. ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. హిడ్మా సహా 13 మందిని పట్టుకుని హత్యచేశారని ఆరోపణలు గుప్పించింది.

మావోయిస్టు హత్యలకు సాక్ష్యమే నకిలీ ఎన్‌కౌంటర్లు

అధికార పార్టీ మీడియా, మోదీ అనుకూల మేధావులు హిడ్మాను చాలా కాలంగా విలన్‌గా చిత్రీకరించారని, ఆయనను చంపిన తర్వాత కూడా అదే కొనసాగిస్తున్నారని వికల్ప్ ఆరోపించారు. అయితే, హిడ్మా అల్లూరి సీతారామ రాజు వంటి వారి హృదయాల్లో నిలిచి ఉంటారని పేర్కొన్నారు. ఈ హత్యలను కప్పిపుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లని కట్టుకథలు అల్లారని పేర్కొంది.

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ ఒట్టి బూటకం. ‘ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. చనిపోయిన మావోయిస్టుల ఆశయాలను నెరవేరుస్తాం అని వికల్ప్ పేరిట విడుదలైన ఆ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ‘హిడ్మా ఎన్‌కౌంటర్‌కు దేవ్‌జీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీశ్ కుంజా ఆరోపించడం కుట్రేనని ఆరోపించింది. విజయవాడలో అరెస్టున కామ్రేడ్లకు న్యాయ సహాయం అందించాలి. ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల నేతలు వారికి హెల్ప్ చేయాలి’ అని లేఖలో వికల్ప్ కోరారు.