06-12-2025 12:08:21 AM
పార్లమెంటులో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను ప్రస్తావించిన ఎంపీ ఈటల
మేడ్చల్,(విజయక్రాంతి): మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ పార్లమెంటులో జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ సమస్యను ప్రస్తావించారు. 40 లక్షల ఓటర్లతో 70 లక్షల జనాభా కలిగిన మల్కాజిగిరి పార్లమెంటులోని జవహర్ నగర్ లో 40 ఏళ్ల క్రితం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని, అప్పట్లో ఒకటి, రెండు వాహనాలు వచ్చి చెత్త వేసేవన్నారు. ప్రస్తుతం నలభై వేల టన్నుల చెత్తను ఒకే చోట వేస్తున్నారని, 30 కిలోమీటర్ల చుట్టూ నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు.
దుర్వాసనతో పాటు కీటకాల వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకే చోట ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉండొద్దని, హైదరాబాద్ నగరంలో నాలుగు దిక్కుల డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని 2017 నుంచి చాలాసార్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం చూపలేదని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని పర్యావరణ శాఖ మంత్రిని కోరారు. జవహర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కాపాడాలని కోరారు.