05-07-2025 12:03:17 AM
హైదరాబాద్, జులై 4 (విజయక్రాంతి): సిగాచి పరిశ్రమ పేలుడు స్థలం నుంచి ఫోరెన్సిక్ పరీక్షల కోసం సేకరించిన సాంపిల్స్‌ను ప్యాక్ చేసిన బాక్సులను మృతదేహాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అవి మృతదేహాలు కాదు.. కేవలం పరీక్షల కోసం సేకరించిన శాంపిల్స్‌ను ప్యాక్ చేసిన బాక్సులు మాత్రమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టతనిచ్చారు.
ఘటనా స్థలంలో దొరికిన ప్రతి మృతదేహాం/శరీర భాగాల నుంచి శాంపిల్స్‌ను సేకరించి, వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు. ఈ శాంపిల్స్‌ను ఉపయోగించి శాస్త్రీయంగా డీఎన్‌ఏ పరీక్షలు చేసి, కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో పోల్చి చూసి, డీఎన్‌ఏ మ్యాచ్ అయిన ప్రతి మృతదేహాన్ని ప్రీజర్‌లో పెట్టి, కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని వెల్లడించారు.
ఫ్రీజర్లను అంబులెన్సులలో ఉంచి, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి స్వగ్రామాలకు తరలిస్తున్నామని చెప్పారు. దహన సంస్కారాలు, ఇతర అవసరాల కోసం మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.లక్ష చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందజేసినట్టు మంత్రి తెలిపారు. ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో రూ.కోటి పరిహారం అందజేస్తామన్నారు.