calender_icon.png 5 July, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను డల్ స్టూడెంట్ నే కానీ నేడు ఐఏఎస్ గా సేవలందిస్తున్న..!

05-07-2025 03:31:04 PM

ప్రతి విద్యార్థిపై ఒక గంట ప్రత్యేక శ్రద్ధ చూపండి చాలు

మంచి ఫలితాలొస్తాయి

ఆ స్టూడెంట్ మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాడు

ప్రభుత్వ ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కీలక వ్యాఖ్యలు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారని అలాంటి విద్యార్థులపై ఉపాధ్యాయుడు ఒక గంట పాటు ప్రత్యేక శ్రద్ధ చూపి పాఠ్యాంశాలపై రివిజన్ నిర్వహిస్తే మంచి ఫలితాలు సొంతమవుతాయని అలాంటి విద్యార్థులు గురువులను జీవితాంతం గుర్తుంచుకుంటారని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badavath Santosh) ఉపాధ్యాయులతో కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడారు. తీసుకునే నెల జీతానికి అనుగుణంగా పాఠశాలకు వచ్చామా వెళ్ళామా అని కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బాధ్యతగా ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యను అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఆయా పాఠ్యాంశాలపై భయాన్ని వీడేలా శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నత స్థానానికి ఎదిగిన నాడు చదువు చెప్పిన గురువుని తప్పనిసరిగా గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తానేనంటూ తాను ఒక డల్ స్టూడెంట్ నేనని తన టీచర్ తనపై ప్రత్యేక శ్రద్ధ వహించి తనలోని భయాన్ని పోగొట్టి విద్యను అందించాడని నేడు ఐఏఎస్ స్థాయిలో కలెక్టరుగా ప్రజలకు సేవలు అందిస్తూ ఆ ఉపాధ్యాయుడిని ప్రతినిత్యం పూజిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు సాధించేందుకు టీచర్లు కుంటి సాకులు చెబుతున్నారని ఇది సరైన పద్ధతి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీసుకునే జీతానికి అనుగుణంగానే బాధ్యతగా ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యను అందించాలని పేర్కొన్నారు.