11-10-2025 01:03:42 AM
బోథ్, అక్టోబర్ ౧౦ (విజయక్రాంతి): జాతీయ పక్షి నెమలిని హతమార్చిన ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ ప్రణయ్ తెలిపారు. గాదిగూడ మండలానికి చెందిన గంగా సింగ్ ఉపాధి నిమిత్తం బోథ్ మండలం పొచ్ఛర గ్రామానికి వలస వచ్చాడు. ఐతే తాను పాలేరు గా పని చేస్తున్న పొలం గట్టు పై నాలుగు నెమలి గుడ్ల ను గమనించాడు.
గుడ్ల ను పొదగడానికి నెమలి ఎలాగైనా వస్తుందని గమనించి దాన్ని హతమార్చడానికి ముందస్తు ప్రణాళిక రచించాడు. తన మిత్రులైన వలస కూలీలు దత్తు, బాలాజీ ల సహాయంతో నెమలిని హతమార్చడానికి ప్లాన్ వేశాడు. గురువారం రాత్రి నెమలి గుడ్లపై నెమలి పొదిగి ఉన్న క్రమంలో ఒకరు నెమలి కళ్లపై టార్చ్ వేయగా మిగతావారు నెమలి ని కొట్టి హతమార్చారు.
చనిపోయిన నెమలిని బ్యాగులో వేసుకుని గ్రామానికి వస్తునారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులు పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న సంచిలో నెమలి బౌతిక కాయం లభించింది. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు.