05-05-2024 12:05:00 AM
న్యూఢిల్లీ, మే 4 : ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిజ్జర్‌ను చంపడా నికి భారత ప్రభుత్వం నియమించిన హిట్ స్కాడ్ సభ్యులుగా అనుమానిస్తూ కమల్‌ప్రీత్ సింగ్(22), కరణ్ బ్రార్(22), కరణ్‌ప్రీత్ సింగ్(28)లను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వారి ఫొటోలను విడుదల చేశారు. అయితే వీరందరూ భారత సంతతికి చెందినవారని రాయల్ కెనేడియన్ మౌంటెడ్ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ టెబౌల్ తెలిపారు. ముగ్గురిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపామని వెల్లడించారు. ఈ హత్య లో మరికొంత మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉందని, ఆ దిశ గా దర్యాప్తు చేస్తున్నామని వివరించా రు. నిజ్జర్ హత్య విషయంలో దర్యాప్తు వేగవంతంగా జరుగుతుందని వెల్లడించారు. అయితే హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
ఇదీ కేసు..
2023 జూన్ 18న కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉం దంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అప్పట్లో ఆరోపించారు. దీంతో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాలు లేకుండా నిందలు మోపడం సరికాదని తెలిపింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.