09-10-2025 12:03:44 AM
నిరంతర సీసీ కెమెరాలతో స్ట్రాంగ్ రూమ్ వద్ద పర్యవేక్షణ
ఖమ్మం రూరల్, మధిర, తల్లాడ స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఎన్నికల నియామవళి అనుసరించిస్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు, పకడ్భందీ బందోబస్తు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల, మధిర పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తల్లాడ మండలం రెడ్డిగూడెం లోని జ్యోతి జూనియర్ కాలేజ్ లలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ల ఏర్పాట్లను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబందించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు కలెక్టర్ సూచించారు.
మొదటి విడతలో నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్స్ లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు, రిసెప్షన్ కౌంటర్స్ నిర్వాహణ, కౌంటింగ్ హాల్ లోపల జాలీతో పెన్సింగ్, ఎలక్షన్ సిబ్బందికి, మంచినీటి, భోజన వసతులు, బ్యాలెట్ బాక్సులు తీసుకువచ్చే బస్సుల ట్రాఫిక్ నియంత్రణ, స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు పకడ్బందీగా నియమించాలని, పోలీసు కంట్రోల్ ద్వారా నిరంతర సీసీ కెమెరా పర్యవేక్షణ, మీడియా సెంటర్, వర్షం వలన ఏలాంటి జల్లు రాకుండా మరమ్మత్తులు, సరిపడా వసతులు సమకూర్చాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బోనకల్, మధిర, ఎర్రుపాలెం మూడు మండలాలు, సత్తుపల్లి మధర్ థెరీసా ఇంజనీరింగ్ కళాశాల నందు పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మూడు మండలాలు, రెడ్డిగూడెం క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల నందు ఏన్కూర్, తల్లాడ, కల్లూరు మూడు మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో కల్లూర్ డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, అదనపు డిసిపి ప్రసాద రావు, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఏదులాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్లు కరుణాకర్ రెడ్డి, రాంప్రసాద్, ఎంపీడీవోలు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి ః కలెక్టర్
ఖమ్మం, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఎన్నికల నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్ మధిర నియోజకవర్గంలో అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి బుధవారం పర్యటించారు. మధిర మండలం పరిధిలోని 175 మంది స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కళ్యాణ వేదిక నందు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ట్రైనింగ్ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగహన కల్పిస్తూ ఎన్నికల విధుల పట్ల కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రతి అధికారి కొత్తగా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు భావించి జాగ్రత్తగా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించడానికి వీలు లేదని అన్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఈవిఎం యంత్రాలతో జరిగితే, స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరుగనున్నాయి అని, ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలను శిక్షణలో పూర్తి స్థాయిలో విచారించి తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. ట్రైనింగ్ హాల్ నుంచి సంపూర్ణ అవగాహన తో బయటకు పోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలంటే మనకు నిబంధనలపై సంపూర్ణ పట్టు ఉండాలన్నారు.
రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రి తీసుకున్న దగ్గర నుంచి మళ్లీ అప్పగించే వరకు పూర్తి బాధ్యత పోలింగ్ సిబ్బందిపై ఉంటుందని అన్నారు. రిజర్వ్ ఉన్న అధికారులు కూడా రిపోర్ట్ చేయాలని అన్నారు. శిక్షణకు రాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో మనం చేసే ప్రతి పని నిబంధనల ప్రకారం జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర తహసీల్దారు రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.