06-05-2025 01:28:13 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): తమకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి 10.26 టీఎంసీలు కావాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ను తెలంగాణ కోరింది. హైదరాబాద్ జలసౌధలో సోమవారం జరిగిన సమావేశంలో కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ఏపీ నుంచి ఎవరూ రాలేదు.
అయితే పోలవరం ప్రాజెక్టును నిపుణులు పరిశీలిస్తున్నందున సమావేశానికి హాజరుకాలేమని కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. జూలై నెలాఖరు వరకు తమకు శ్రీశైలం, సాగర్ నుంచి 16 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరగా..మే నెలాఖరు వరకు సాగర్ కుడికాల్వ నుంచి తమకు 10 టీఎంసీలు కావాలని ఏపీ ఇప్పటికే బోర్డును కోరాయి.
పదో తేదీ తర్వాత త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఇకనుంచి కృష్ణా బోర్డు సమావేశాలు విజయవాడలోనే పెట్టాలని ఏపీ ఈఎన్సీ కోరడం విశేషం. జూలై నెలాఖరు వరకు 88 రోజుల తాగునీటి అవసరాల కోసం తమకు 10.26 టీఎంసీలు కావాలని సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ బోర్డును కోరారు.
హైదరాబాద్, నల్గొండ అవసరాల కోసం ఏఎమ్మార్పీ నుంచి 750 క్యూసెక్కులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 300 క్యూసెక్కులతో పాటు ఖమ్మం అవసరాల కోసం 300 క్యూసెక్కులను సాగర్ నుంచి ఇవ్వాలన్నారు. సాగర్‌లో కనీసమట్టం 510 అడుగుల వరకు ఉంచాలని ఆయన కోరారు.
510 దిగువకు పంపింగ్ సరికాదని, ఏపీ వినియోగం తగ్గించుకోవాలని గతంలోనే చెప్పామని ఈఎన్సీ పేర్కొన్నారు. తెలంగాణ అభిప్రాయాలను కేఆర్‌ఎంబీ రాతపూర్వకంగా తీసుకొంది. నీటి విడుదలకు సంబంధించి కేఆర్‌ఎంబీ నుంచి ఆదేశాలు వచ్చే వరకు సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్, ముచ్చుమర్రి నుంచి నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు.