09-10-2025 01:07:33 AM
-రెతిఫైల్ నుంచి కేటీఆర్, మెహిదీపట్నం నుంచి హరీశ్‌రావు
-ఆర్టీసీ ఎండీకి మెమోరాండం, బస్ భవన్ ఎదుట ధర్నా
-సిటీ బస్సుల చార్జీల పెంపును ఖండిస్తూ ఆందోళన
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో సిటీ బస్సుల చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగా చలో బస్ బవన్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం బస్ భవన్ దగ్గర బీఆర్‌ఎస్ నేతలు నిరసన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వేర్వేరు మార్గాల్లో బస్సు ల్లో ప్రయాణించనున్నారు.
మాజీ మంత్రు లు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ ఉదయం 9 గంటలకు రెతిఫైల్ బస్ స్టాప్ నుంచి టీఎస్ ఆర్‌టీసీ బస్ భవన్ వరకు బస్సులో ప్రయాణిస్తారు. హరీశ్‌రావు ఇతర నేతలతో కలిసి ఉదయం 8ః45 గంటలకు ఆర్టీసీ బస్సులో మెహిదీపట్నం నుంచి బస్ భవన్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత అంద రూ కలిసి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు చార్జీల పెంపుపై మెమోరాండం ఇవ్వనున్నారు.
అనంతరం బస్ భవన్ ఎదుట ధర్నా చేపట్టి సిటీ బస్సుల్లో పెంచిన చార్జీలు తగ్గించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఈ మేరకు మొదటి మూడు స్టేజీలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. మెట్రో డీలక్స్, ఈ ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు చార్జీలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఛలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది.