calender_icon.png 24 July, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంచెత్తిన వాన

24-07-2025 12:18:35 AM

- మంగళవారం రాత్రి నుంచి జిల్లాల్లో జోరు వాన

- కరీంనగర్, ఆసిఫాభాద్, ములుగు జిల్లాల్లో ఇళ్లలోకి చేరిన నీరు

- సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి 

- మహబూబాబాద్ జిల్లాలో వాగులో వ్యక్తి గల్లంతు

- మంచిర్యాల జిల్లాలో వాగులో చిక్కుకున్న ట్రాక్టర్

- ఏటూరు నాగారం రోడ్డు ధ్వంసం

- పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

- ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

- గుండ్లవాగు, జలగలంచ వాగుల వరద ఉధృతి పరిశీలన

* వానలకు రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కరీంనగర్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఎడతెరపి లేని వర్షాలకు భారీగా వరదలు రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మహబూబాబాద్ జిల్లాలో వాగులో వ్యక్తి గల్లంతయ్యాడు. మంచిర్యాల జిల్లాలో వాగులో ట్రాక్టర్ చిక్కుకున్నది. భారీ వానకు ములుగు జిల్లాలో ఏటూరు నాగారం రోడ్డు ధ్వంసమైంది. ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మణుగూరులో 12.8 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. 

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 23: జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలతో వాగుల, వంకలు ఉప్పొంగాయి. సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం సవ్వడి చేసింది. తిమ్మాపూర్ మండలం అల్గునూరు వద్ద భారీ వర్షానికి రాజీవ్ రహదారి జలమయమయింది. ఉదయం గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కరీంనగర్ పట్టణంలోని స్మార్ట్ సిటీ రోడ్లపై వరదనీరు చేరుకోవడం తో కలెక్టరేట్, శివ టాకీస్ ప్రాంతం, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు ఉప్పొంగుతున్నాయి. చెరువులు అలుగు దూకుతున్నాయి. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో భారీ వర్షం కురవడంతో ఇండ్లలోకి వరద నీరు చేరింది. 

ఉమ్మడి వరంగల్‌లో వర్ష బీభత్సం

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ఎడా తెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ప్రవాహం పెరగడంతో ములుగు, వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూరునాగరం మండల కేంద్రంలోని బొగత జలపాతానికి ఎగువ నుంచి భారీగా వరదనీరు చేరడంతో పర్యాటకుల సందర్శన నిలిపివేశారు.

వాజేడు మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మంగపేట మండలంలోని రాజుపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది. మంగపేట మండలంలోని గంపోనిగూడెం వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న ఏటూరునాగారం డబుల్ లేన్ అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి వరద ఉధృతికి గండిపడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సమీప అడవుల్లోంచి వచ్చిన వరద గిరిజన పెట్రోల్ బంక్ దగ్గర కల్వర్టు మీదుగా వేగంగా ప్రవహించింది. దీంతో రహదారి సగం ధ్వంసమైంది. దాని కింద ఉన్న 10 అడుగుల లోతైన భారీ సిమెంట్ మోరీలు బయటపడ్డాయి. 

దూప్‌సింగ్ తండాకు నిలిచిన రాకపోకలు 

మెదక్ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి హవేలీఘనపూర్ మండలంలోని ఓ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో దూప్‌సింగ్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏటా ఇదే తంతు సాగుతుందని స్థానిక ప్రజలు చెపుతున్నారు. గత ప్రభుత్వం 2021లో 3కోట్ల రూపాయల వ్యయంతో ఈ వాగుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. కానీ గుత్తేదారులు మధ్యలోనే వదిలేశారు. అధికారులు గుత్తేదారులకు నోటీసులు అందించినప్పటికీ స్పందన లేదు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలుమార్లు తండావాసులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన స్పందన లేదన్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం ఘనపూర్ పెద్దవాగులోని చెక్ డ్యాం పరవాళ్ళు తొక్కుతుంది. మండలంలో పెద్దగా వర్షాలు లేనప్పటికీ ఎగువ ప్రాంతంలోని మద్దూరు, లద్దునూరు, చేర్యాల మండలాల్లో కురుస్తున్న వర్షాలకు పెద్ద వాగు పై నిర్మించిన చెక్ డ్యాం బుధవారం నిండుకుండలా మారింది. 

ప్రజలను అప్రమత్తం చేయాలి: మంత్రి సీతక్క

ములుగు జిల్లాలోని పసర తాడ్వాయి మధ్యలో ఉన్న జలగలంచ గుండ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంత్రి సీతక్క మంగళవారం గుండ్లవాగుతో పాటు జలగలంచ వాగుల వరద ఉధృతిని పరిశీలించారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మంత్రి సీతక్క ప్రజలకు సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఏమైనా సందేహాలుంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కాల్ చేయాలని సూచించారు. 

ఉప్పొంగుతున్న దుందుబీ వాగు

గత మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని దుందుబీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాడూరు మండలం సిర్సవాడ వద్ద దుందుబీ నదికి అనుసంధానంగా గ్రామాల మీదుగా ప్రవహించే నది తీవ్రత పెరగడంతో సిర్సవాడ, పాపగల్ మాదారం రేవల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

ట్రాక్టర్‌తో సహా వాగులో చిక్కుకున్న నలుగురు

మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్‌లో పత్తి చేనుకు మందు కొట్టడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఎర్రవాగు ఉధృతికి ట్రాక్టర్ చిక్కుకుంది. కన్నెపల్లి మండలం జంగంపల్లికి చెందిన బోరుకుంట రాజం తన భార్య మరో ఇద్దరు కూలీలతో భీమిని మండలం చిన్న తిమ్మాపూర్‌లో పత్తి చేనుకు మందు కొట్టేందుకు తన ట్రాక్టర్‌పై మంగళ వారం ఉదయం వెళ్లారు. కురిసిన భారీ వర్షానికి ఎర్రవాగు ఉప్పొంగడంతో రాత్రి తిరుగు ప్రయాణంలో గత్యంతరం లేక ట్రాక్టర్ సహాయంతో వాగు దాటుతుండగా నీటి ఉధృతికి ట్రాక్టర్‌తో సహా వరదలో చిక్కుకున్నారు. వరద ఉధృతిలో కొట్టుకుపోయే ప్రమాదం నుంచి నలుగురు వ్యక్తులు (రైతు కుటుంబం, కూలీలు) ప్రాణాలను దక్కించుకుని తృటిలో ప్రాణాలు దక్కించుకొని ఒడ్డుకు చేరారు. 

ఉప్పొంగుతున్న వాగులు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా 161వ జాతీయ రహదారిపై పక్కన గల నల్లవాగు మత్తడి పొంగి పొర్లుతుంది. ఇది కల్లేరు 45 అంత సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగు ప్రాంతంతో పాటు ఎగువ భాగంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లుతుంది. కరీంనగర్ జిల్లాలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. డోర్నకల్ వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బయ్యారం పెద్ద చెరువులోకి 13 అడుగుల నీరు చేరింది. పాకాల, మున్నేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొంతమంది యువకులు మున్నేరు వాగు చూసేందుకు అక్కడికి చేరుకొని బ్రిడ్జి పై సెల్ఫీలు దిగుతుండగా అప్రమత్తమైన బ్లూ కోర్ట్ సిబ్బంది యువకులను అక్కడి నుంచి పంపించారు. గార్ల - మద్దిమంచ, రాంపూర్ గ్రామాల మధ్య వాగు ఉధృతితో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చెక్ డ్యాం పైనుంచి రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా వరద దాదాపు మూడు అడుగులకు పైగా ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించింది.

ఆరెంజ్ అలర్ట్ జారీ.. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని.. ఇది గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీనిప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. అలాగే రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

వాగులో వ్యక్తి గల్లంతు 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల రాళ్లతిట్టే వాగు గత రెండు రోజులగా కురుస్తున్న వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చేపల వేటకు వెళ్లిన ఆగబోయిన నరేష్ (30) వరద ఉధృతికి గల్లంతయ్యాడు. నరేష్ ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్ సిక్రిగేషన్ షెడ్డులో ఉంటున్న మతిస్థిమితం లేని వ్యక్తి రెండు వాగులు ఉప్పొంగడంతో అందులో చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ టీం కు సమాచారం అందించి సహాయక చర్యలు చేపడుతున్నారు. 

జలపాతంలో విద్యార్థి.. 

ఆదిలాబాద్: పాఠశాలకు సెలవు ఉండటంతో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్ ఖండాల జలపాతానికి విహార యాత్రకు వెళ్లగా విద్యార్థి గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ పట్టణంలోని భూక్తాపూర్ కాలనీకి చెందిన మనోహర్ సింగ్ (15) తన ఇద్దరు మిత్రులతో కలిసి బుధవారం ఖండాల జలపాతం వద్దకు వెళ్లారు. స్నేహితులతో కలిసి జలపాతంలో స్నానం చేస్తుండగా, ప్రమాదవశాత్తు జలపాతంలో మనోహర్‌సింగ్ గల్లంతయ్యాడు.పోలీసులు డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సభ్యులతో గాలింపు చేపట్టారు.