02-09-2025 12:00:00 AM
ములకలపల్లి, సెప్టెంబర్ 1,( విజయ క్రాంతి): ములకలపల్లి మండలంలో కుండ పోతగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నుండి అలుగులు పోస్తున్నాయి. మండలంలో ఉన్న మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన మూక మామిడి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు నిండి అలుగు పోసింది. సోమవారం తెల్లవారుజామున కురిసిన ఈ కుండపోత వానకు ములకలపల్లి మండలంలో ఎన్నడు లేనంతగా రికార్డు స్థాయిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మండలంలో ఉన్న ముర్రేడు, పాములేరు, సాకి వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. సీతారాంపురం పంచాయతీలో పాతూరు నుంచి ఎర్రోడ్డు గ్రామానికి వెళ్లే అంతర్గత పంచాయతీ రహదారి కోతకు గురైంది. మండలంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రెవెన్యూ పోలీసు,వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేశారు.