calender_icon.png 8 September, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు 42% రిజర్వేషన్లు

02-09-2025 12:00:00 AM

డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి 

మేడ్చల్, సెప్టెంబర్ 1(విజయ క్రాంతి): బిజెపి, బి ఆర్ ఎస్ పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు  తీసుకుంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సోమవారం మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిసిసి ప్రధాన కార్యదర్శిలు గజ్జలకాంతం, శశికళ యాదవ రెడ్డి  హాజరయ్యారు.

ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల విషయంలో బిజెపి రెండు నాలుకల ధోరణి అవలంబించిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్దతు పలికి, కేంద్రంలో వ్యతిరేకించిందన్నారు. బిజెపి మోసం చేసిందన్న విషయం తెలిసిపోయిందని, త్వరలో ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిందని, తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు తెలిపిందన్నారు. 

బీసీల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలువనుందన్నారు. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేని విధంగా కులగణన చేసిందన్నారు. ఎన్ని అడ్డంకులు , సమస్యలు ఎదురైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో రిజర్వేషన్ల విషయమే విస్తృత ప్రచారం చేస్తామన్నారు.

మోదీ బీసీ అవునో కాదు తెలియదు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం 

ప్రధాని మోడీ బీసీ అయి ఉండి కూడా బీసీలకు ఏమి చేయలేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం విమర్శించారు. బిజెపికి హిందువుల ఓట్లు కావాలి కానీ, హిందువులైన బీసీలకు ఏమి చేయరన్నారు. మోడీ హయాంలో సామాజిక న్యాయం జరగలేదన్నారు. మోడీ బీసీ అవునో కాదో తెలియదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రేవంత్ రెడ్డి కులగనన చేశారని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి 30 ఏళ్ల కల నెరవేర్చిన  ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. బి ఆర్ ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ అని, అందులో బీసీలకు స్థానం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.

పిసిసి ప్రధాన కార్యదర్శి శశికళ యాదవ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. డబ్బు లేనిదే రాజకీయం లేదని, డబ్బు సంపాదించుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి వజ్రాష్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, గ్రంథాలయ చైర్మన్ బొంగునూరు శ్రీనివాసరెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గువ్వా రవి ముదిరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, వేముల శ్రీనివాసరెడ్డి, గోమారం రమణారెడ్డి, సాయి పేట శ్రీనివాస్, మణికంఠ గౌడ్, కౌడే మహేష్, ఉదండపురం సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.