14-08-2025 02:11:06 AM
హైదరాబాద్, సిటీబ్యూరో ఆగస్టు 13 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పర్యాట కుల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ డాక్టర్ జితేందర్ వెల్లడించారు.
బుధవారం డీజీపీ కార్యాలయంలో పర్యాటక మరియు పోలీస్ శాఖల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమన్వయ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తొలి దశలో 80 మందితో ప్రారంభం
ప్రపంచ పర్యాటక దినోత్సవమైన సెప్టెంబర్ 27వ తేదీ నాటికి ఈ వ్యవస్థను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీజీపీ తెలిపారు. తొలి దశలో పర్యాటక శాఖకు 80 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విదేశీ, స్వదేశీ పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఆధ్యాత్మిక, వైద్య, వినోదాత్మక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు.
పర్యాటక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి..
ఈ టూరిస్ట్ పోలీసులు రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రాలలో సేవలు అందిస్తారని డీజీపీ వివరించారు. ముఖ్యంగా అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధ వనం, భద్రాచలం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వంటి ప్రదేశాలలో వీరిని మోహరించనున్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
షూటింగ్ అనుమతులకు పక్కా ప్రణాళిక.. రాష్ట్రంలో సినిమా షూటింగ్లు, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పర్యాటక శాఖ స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని డీజీపీ సూచిం చారు. సినిమా నిర్మాతలు ముందుగా సమాచారం ఇస్తే, భద్రత కల్పించేందుకు తగిన సమయం దొరుకుతుందని తెలిపారు. టూరిజం శాఖ ఎండీ వి. క్రాంతి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సిహె. ప్రియాం క, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, మల్టీ జోన్ 2 ఐజీపీ తఫ్సీర్ ఇక్బాల్ పాల్గొన్నారు.