04-10-2025 06:43:23 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఓట్ చోర్ పెద్ద ఎత్తున జరిగిందని, ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం బీజేపీకి అనుబంధ సంఘంగా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో ఓట్ చోరీలను బయటపెట్టారని, ఆధారాలు చూపించినా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం ఆలస్యమైందని, భారీ వర్షాలు దృష్ట్యా సంతకాల సేకరణ ప్రారంభించలేదని పీసీసీ అధ్యక్షులు వెల్లడించారు. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని, గ్రామంలో కనీసం వంద మందితో సంతకాలు చేయించాలని ఆయన సూచించారు. బీజేపీ ఓట్ చోరీ ఎలా చేసిందో ప్రజలకు వివరించాలని, ఎమ్మేల్యేలు, డీసీసీ అధ్యక్షులు ప్రతి గ్రామంలో సంతకాలు సేకరణ చేపట్టాలని మహేష్ గౌడ్ తెలియజేశారు.