calender_icon.png 2 July, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటు బంద్ ఇటు తాకీదులు..

01-07-2025 06:11:04 PM

కేసముద్రంలో రోడ్ల విస్త‘రణం’

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీలో రోడ్ల విస్త‘రణం’ తారాస్థాయికి చేరింది. 80 ఫీట్లు విస్తరణం వద్దని, 60 ఫీట్లకు కుదించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పట్టణ బందుకు పిలుపునిచ్చారు. మార్కెట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు వ్యాపారులు షాపులు మూసి నిరసన తెలిపారు. 80 అడుగులకు రోడ్డు విస్తరిస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతింటామని, ప్రభుత్వ స్పందించి రోడ్డు విస్తరణను 60 అడుగులకు తగ్గించాలని డిమాండ్ చేశారు. 

ఆక్రమణలపై నోటీసులు జారీ చేసిన బల్దియా అధికారులు 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న షాపులు ఇండ్ల యజమానులకు మంగళవారం నుంచి బల్దియా అధికారులు తాకీదులు జారీ చేస్తున్నారు. 2019 మున్సిపల్ ఆక్ట్ ప్రకారం కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ పట్టణంలోని పాత బజార్, పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు నోటీసులు జారీ చేశారు. బుధవారం అంబేద్కర్ సెంటర్ నుండి కేసముద్రం (వి) వరకు నోటీసులు జారీ చేస్తామని వార్డు ఆఫీసర్ ప్రభాకర్ తెలిపారు. ఏడు రోజుల్లో నిర్మాణాలకు సంబంధించిన తమ వద్ద ఉన్న పత్రాలతో నోటీసుకు సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఒకవైపు 60 అడుగులు తగ్గించాలని ఆందోళనలు.. ఇంకోవైపు అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కేసముద్రంలో విస్త‘రణం’గా మారింది.