calender_icon.png 2 July, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్మిషన్లు సర్కారువి.. ఫీజులు ప్రైవేటుకు!

02-07-2025 12:00:00 AM

  1. అక్రమ అడ్మిషన్ల దందాకు తెరలేపిన ప్రైవేటు అకాడమీ 
  2. యాజమాన్యానికి సహకరిస్తున్న ప్రభుత్వ కాలేజీలు
  3. నల్లగొండలో చెలరేగిపోతున్న ప్రైవేటు కాలేజీ

నల్లగొండ ప్రతినిధి, జూలై 1 (విజయక్రాంతి) : పేరుకేమో అది డిఫెన్స్ అకాడమీ. ఇంటర్ పర్మిషన్ లేదు. కానీ అక్కడ దర్జాగా ఇంటిగ్రేటెడ్ కోర్సుల పేరుతో ఇంటర్ తరగతులను నిర్వహించేస్తున్నారు. సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న చందంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లు ఇప్పించి తమ ప్రైవేటు డిఫెన్స్ అకాడమీలో క్లాసులు నిర్వహిస్తూ కొత్త దందాకు తెరలేపిన బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ ఆ డిఫెన్స్ అకాడమీ మరేదో కాదండోయ్.. నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని రామయ్య డిఫెన్స్ అకాడమీ. నిజానికి రామయ్య డిఫెన్స్ అకాడమీకి ఇంటర్ అనుమతి లేకపోయినా.. ప్రైవేటు కాలేజీలతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పిస్తుండడం కొసమెరుపు. ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి ఇంటిగ్రేటెడ్ కోర్సు పేరుతో రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారు.

కానీ విద్యార్థులు, తల్లిదండ్రులకు మాత్రం తమ కాలేజీలోకే పర్మిషన్ ఉందంటూ మాయమాటలు చెప్పి.. బుట్టలో వేసుకుంటుండడం గమనార్హం. రామయ్య డిఫెన్స్ అకాడమీ బాగోతాన్ని, అందుకు సహకరిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల దందా వెలుగులోకి వచ్చినా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు..

రామయ్య డిఫెన్స్ అకాడమీకి ఇంటర్ కాలేజీ నిర్వహించేందుకు ఏలాంటి అనుమతి లేదు. కానీ సదరు డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం మాత్రం అనుమతులు ఉన్నాయంటూ విద్యార్థులను బురిడీ కొట్టిస్తున్నారు. నార్కట్పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీతో పాటు నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి తమ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కాలేజీ నుంచి సైతం అడ్మిషన్ల ప్రక్రియను డిఫెన్స్ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా చేస్తోంది.

దీంతో ఇంటర్ పరీక్షలను సైతం సదరు ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచే విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఈ దందాకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి సహాకారం అందుతుండడంతో డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం అమ్యామ్యాలు భారీగా ముట్టజెబుతోంది. ఇదిలావుంటే.. ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు అడ్మిషన్ తీసుకుని క్లాసులకు హాజరుకాకుండా..

ప్రైవేటు విద్యాసంస్థల్లోకి వెళుతుంటే.. అక్రమ పద్దతుల్లో పొందిన అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు దొంగలకు సద్దులు మోస్తుండడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.

అనుమతుల్లేకుడానే తరగతులు..

డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యే విద్యార్థులకు సదరు యాజమాన్యం ఇంటర్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల నుంచి విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పించి.. తరగతులను మాత్రం డిఫెన్స్ అకాడమీలోనే యాజమాన్యం నిర్వహిస్తుండడం గమనార్హం. వాస్తవానికి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా డిఫెన్స్ అకాడమీ తరగతులను నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది.

కనీసం డిఫెన్స్ అకాడమీలో ఇంటర్కు సంబంధించిన ఫ్యాక్టలీ లేదు. అయినా ఒకరిద్దరితోనే ఇంటర్ క్లాసులను మమ అన్పించేస్తుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. విద్యాశాఖ మాత్రం చోద్యం చూస్తోంది. దాదాపు నాలుగైదు ఏండ్లుగా వందలాది మంది విద్యార్థులు నష్టపోతున్నా.. విద్యాశాఖ మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఓవైపు అర్హతల్లేని ఫ్యాకల్టీతో అనుమతుల్లేకుండా క్లాసులు జరుగుతుంటే..

జిల్లా యంత్రాంగం మాత్రం ఆ పని మాది కాదంటూ పక్కకు తప్పుకోవడం విమర్శలకు దారితీస్తోంది. రామయ్య డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ తరగతులు నిర్వహించే వ్యవహారంపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దస్రునాయక్ను వివరణ కోరగా, పరిశీలిస్తామంటూ చావుకబురు చల్లగా చెప్పడం కొసమెరుపు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుని తరగతులకు హాజరుకాకపోవడం..

అనుమతులే లేని ఓ ప్రైవేటు అకాడమీ ఇంటర్ కాలేజీని నిర్వహించడంపై జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం భవిష్యత్తు తరాలకు తీరని నష్టమనే  చెప్పాలి. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.